
Goa Elections: గోవా ప్రజలకు ఉచిత తీర్థయాత్రలు: కేజ్రీవాల్
పనాజీ: దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవా ఎన్నికలపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది గోవాలో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటి.. అధికారం చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ముందుగానే గోవాలో పర్యటిస్తూ అక్కడి ప్రజలపై వరాలు కురిపిస్తున్నారు. తాజాగా గోవాలో నిర్వహించిన పలు సభల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రజలను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
గోవాలోని హిందువులను అయోధ్యకు, క్రైస్తవులను వేలంకన్నికి, ముస్లింలను అజ్మీర్ షరీఫ్‌కు అలాగే.. సాయిబాబాను కొలిచే భక్తులను షిర్డికి ఉచితంగా తీసుకెళ్తామని వెల్లడించారు. ఇక జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భాజపా, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఒక దానిపై మరొకటి చర్యలు తీసుకోవద్దని ఆ రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని వ్యాఖ్యానించారు.
గతంలోనూ అరవింద్ కేజ్రీవాల్ గోవాలో పర్యటిస్తూ.. ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల గోవాలో ఆప్ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఆప్‌లో చేరుతున్నారు. కాగా.. గోవా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారబోతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.