Gali Janardhan: రాజకీయాల్లో.. ఇక ‘ఫుట్‌బాల్‌’ ఆడుకుంటా..!

‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీని స్థాపించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhana Reddy).. సోమవారం పార్టీ గుర్తు ‘ఫుట్‌బాల్‌’ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 12 అభ్యర్థులతోకూడిన జాబితా, ఎన్నికల మేనిఫెస్టోనూ విడుదల చేశారు.

Published : 27 Mar 2023 21:44 IST

బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాల(Illegal Mining)కు సంబంధించిన కేసులో విచారణను ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhana Reddy).. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(Kalyana Rajya Pragati Paksha) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఆయన పార్టీ ఎన్నికల గుర్తుగా ‘ఫుట్‌బాల్‌(Football)’ను కేటాయించింది. సోమవారం ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన.. కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 12 మంది అభ్యర్థులతోకూడిన జాబితా, ఎన్నికల మేనిఫెస్టోనూ విడుదల చేశారు. కొప్పల్ జిల్లా గంగావతి నుంచి తాను, బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తన సతీమణి అరుణలక్ష్మి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

‘ఇదివరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో.. సొంతవారు, ఇతరులు, శత్రువులనే తేడా లేకుండా అందరూ నన్ను ఫుట్‌బాల్‌ ఆడుకున్నారు! ఇప్పుడు నేనూ వారితో ఫుట్‌బాల్ ఆడగలనని నిరూపించేందుకు రంగంలోకి దిగా’ అని జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం, రైతులకు రోజూ 9 గంటల ఉచిత కరెంటు, గృహిణులకు నెలకు 2,500 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 నిరుద్యోగ భృతి’ తదితర హామీలతో కూడిన మేనిఫెస్టోను ఈ సందర్భంగా విడుదల చేశారు.

మైనింగ్ కుంభకోణంలో అరెస్టు మొదలు.. దాదాపు 12 ఏళ్లుగా గాలి జనార్దన్‌రెడ్డి రాజకీయంగా నిష్క్రియంగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీని స్థాపించడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటిని తన రాజకీయాలను మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో.. ముఖ్యంగా బళ్లారి బెల్ట్‌లో ఓట్లను చీల్చడం ద్వారా భాజపాపై కేఆర్‌పీపీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కేఆర్‌పీపీ ప్రధానంగా కల్యాణ- కర్ణాటక(పూర్వపు హైదరాబాద్- కర్ణాటక) ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాలు, తెలుగు జనాభా అధికంగా ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇదిలా ఉండగా.. జనార్దన్‌రెడ్డికి గతంలో భాజపాతో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని