కార్యకర్తగా మొదలై కేంద్ర కేబినెట్‌ మంత్రి దాకా..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోదీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో.....

Updated : 08 Jul 2021 10:50 IST

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్‌రెడ్డి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోదీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి నాలుగోసారి అనూహ్యంగా ఓటమిపాలైన కిషన్‌రెడ్డికి.. ఆ పరాజయం మరో రూపంలో కలిసి వచ్చింది. కృషి, పట్టుదల, నిజాయితీ, ఓర్పుతో కూడిన ఆయన వ్యక్తిత్వమే మోదీ సర్కార్‌ను మెప్పించేలా చేసిందని చెప్పొచ్చు. తాజాగా కేంద్ర కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డితో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. 

కిషన్‌ రెడ్డి ప్రస్థానం..
గంగాపురం కిషన్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో  1960లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా రెండుసార్లు (2010-14), తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రెండేళ్లు (2014-16) పనిచేశారు. అసెంబ్లీలో భాజపా శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌‌, వాజ్‌పేయీ ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్‌ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి జనతా పార్టీలో చేరారు. ఓవైపు పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తన చదువును కొనసాగించారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చిన కిషన్‌రెడ్డి అప్పటి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1999లో కార్వాన్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్‌రెడ్డి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో హిమాయత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్‌పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  కొద్ది ఓట్ల తేడాతో పరాజయం పాలైన కిషన్‌రెడ్డి 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్న ఆయన.. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగారు.  

నిత్యం జనంతో మమేకం
నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటారని కిషన్‌రెడ్డికి పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్‌ తిన్నప్పటికీ ఫలితాలు వచ్చిన మరుసటిరోజే అంబర్‌పేటలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పొచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేటలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిన కిషన్‌రెడ్డి, లోక్‌సభ ఎన్నికల్లో అదే అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో 45 వేల మెజార్టీని సాధించడం విశేషం. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కరోనా సమయంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సౌమ్యుడు, వివాద రహితుడు, పార్టీకి విధేయుడిగా తన బాధ్యతలను నిర్విరామంగా కొనసాగించడం ద్వారా ప్రత్యేక ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు