TS News: ప్రవీణ్‌కుమార్‌ భయంతో వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు: తెరాస

ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌

Updated : 12 Oct 2022 14:37 IST

హైదరాబాద్‌: ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెరాసపై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎందుకు ప్రశ్నించరని అన్నారు.

‘‘ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, దళిత జాతిని పైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిల్లో పాలు పంచుకున్న ప్రవీణ్‌గారు.. ఒక్క రూపాయి దళితుల కోసం పనిచేయకుండా, ఇస్తామన్న ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు. ఎందుకంటే, ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉండి, ఇష్టం వచ్చిన ప్రమాణాలు చేయించి, ఇష్టారీతిగా వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగం ఉంటుందో, పోతుందోనన్న భయాందోళనతో జాతికోసం బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బహుజన్‌ సమాజ్‌పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అంటే, ఏమవుతోందనన్న భయం ఆయనలో ఉంది. ఇది గమనించాలని తెలంగాణ దళిత జాతిని కోరుతున్నా’’

‘‘ప్రతి పదేళ్లకొకసారి ఇలాంటి వాళ్లు బయలుదేరతారు. దళిత జాతి బాగుపడుతుంటే వాళ్లను ఆగమాగం చేసి, గందరగోళం చేయాలని చూస్తారు. దళితులకు ప్రమోషన్స్‌, ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో చేస్తున్నారు. ఎప్పటికైనా విజయం సాధించేది ప్రజలేనని కేసీఆర్‌ అంటారు. సందర్భాన్ని బట్టి, ఎవరిని నమ్మాలి.. ఎవరికి చురకలు పెట్టాలో ప్రజలకు బాగా తెలుసు. గతంలో చాలా మంది అధికారులు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. మీరు భాజపా ప్రయోగిస్తున్న కుట్రలో భాగంగా వస్తున్నారు. వాళ్లు మిమ్మల్ని పావుగా వాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను విచ్ఛినం చేసే దిశగా భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కుమార్‌ గ్రహించాలి. దళిత బంధులాంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు. త్వరలోనే మీకు కనువిప్పు కలుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కారు విజయం తథ్యం.’’ అని కిషోర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని