దీదీ.. గాయాన్ని రాజకీయం చేయకండి 

ఇటీవల నందిగ్రామ్‌లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. ఆ ఘటన స్వల్ప ప్రమాదమేనన్నారు......

Published : 15 Mar 2021 17:28 IST

ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హితవు

కోల్‌కతా: ఇటీవల నందిగ్రామ్‌లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. ఆ ఘటన స్వల్ప ప్రమాదమేనని, ఎన్నికల్లో గెలిచేందుకు దీదీ ఎమోషనల్‌ కార్డు ప్రయోగిస్తున్నారని ప్రజలకు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు జనం ఓట్లు వేయరని తెలిపారు. సోమవారం పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక విమానంలో వెళ్తూ ‘ఈటీవీ భారత్‌’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘మమతకు జరిగింది ప్రమాదమేనని అందరూ అంటున్నారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దు. దీదీ, మేము ప్రజా కోర్టుకు వెళ్తున్నాం. ప్రజలు ఇచ్చే నిర్ణయాన్ని అంగీకరించేలా ముందుకు సాగాలి’’ అన్నారు.

200 స్థానాల్లో గెలుపు మాదే!

ఈ ఎన్నికల్లో భాజపాకు 200 సీట్లు రావడం ఖాయమని గడ్కరీ విశ్వాసం వ్యక్తంచేశారు. కార్యకర్తల అవిశ్రాంత కృషి, ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా భాజపా లక్ష్యం నెరవేరబోతోందన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా అంగీకరించాలన్నారు. వివాదాలు సృష్టించడం, ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడం సరైంది కాదని హితవు పలికారు. నందిగ్రామ్‌లో దీదీ గాయపడిన ఘటన దురదృష్టకరమన్న గడ్కరీ.. దీన్ని రాజకీయం చేయొద్దని ఆమెకు విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌ ప్రజలు ఈసారి భాజపాను ఆదరిస్తే రాష్ట్రంలోని రెండు భారీ జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని రెండేళ్లలోనే పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత పోలింగ్‌ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్‌ 29న అక్కడ తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని