Congress: కాంగ్రెస్‌లో చేరిన భారాస గద్వాల ఎమ్మెల్యే

భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్‌ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 07 Jul 2024 04:14 IST

త్వరలో మరికొందరు!

ఈనాడు, హైదరాబాద్‌: భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్‌ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్, గద్వాలలో భారాస నెగ్గగా మిగిలిన 12 చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో ఇక అలంపూర్‌లో తప్ప మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ శాసనసభ్యులే ఉన్నట్లవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన నచ్చడంతో పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. కాగా.. రాష్ట్రంలో త్వరలో మరికొందరు భారాస ఎమ్మెల్యేలు చేరతారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే చేరికలు ఉండే అవకాశాలున్నాయని నేతలు చెపుతున్నారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ వారు అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారు పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని