Ganta srinivas rao: రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా

రుషికొండలో రహస్యంగా విలాస భవనాలను కట్టారని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Updated : 16 Jun 2024 17:58 IST

విశాఖ: స్థానిక నాయకులతో కలిసి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారు. ముందు పర్యాటకం అన్నారు.. తర్వాత పరిపాలన భవనాలు అన్నారు. రూ.450 కోట్ల ప్రజాధనం ఏం చేశారు?. వైకాపా నాయకులకే ఈ కాంట్రాక్టు ఇచ్చారు. రుషికొండ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం. ఈ భవనాల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రుషికొండ భవనాల నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారు. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవనే కారణంతో జగన్ సర్కార్ కూల్చివేసింది. రుషికొండ భవనానికి ఏ అనుమతులు ఉన్నాయి..? ఎవరినీ అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ప్రారంభించారు. ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు నిర్మించారు?’’ అని గంటా ప్రశ్నించారు.

రాజ్‌మహల్‌ రహస్యం బట్టబయలైంది..

‘‘రుషికొండపై గత  ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన రాజ్‌మహల్‌ రహస్యం తెలుసుకోవాలనే ఆతృత, ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ఇవాళ ఆ భవనాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించాం. రాజ్‌మహల్‌ రహస్యం బట్టబయలైంది. రుషి కొండపై ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ప్రయత్నిస్తే  అడ్డుకున్నారు. అక్కడికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై అక్రమ కేసులు పెడితే వారు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్మాణం చేపడితే అందులో రహస్యాలు ఉండవు. ఆ భవనం ఎందుకోసం, ఎంత విస్తీర్ణంలో కడుతున్నారనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు. కానీ, అందుకు భిన్నంగా.. అత్యంత గోప్యంగా రుషికొండపై భవనాలు నిర్మించారు. దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన ఏ ప్రభుత్వ భవనాలు కూడా ఇంత వివాదాస్పదం అయి ఉండవు. టూరిజం కోసం ఒకసారి, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ అని మరోసారి, కాదు.. సీఎం క్యాంపు కార్యాలయం అని చెప్పి.. వెబ్‌సైట్‌లో పెట్టి కూడా డిలీట్‌ చేశారు. అంచనాలు కూడా చాలా గోప్యంగా ఉంచారు.

ప్రజావేదిక కూల్చినప్పుడు జగన్‌ ఏం చెప్పారు?

ప్రజావేదిక కూల్చివేసినప్పుడు జగన్‌ చెప్పిన కారణం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రజా వేదిక భవనానికి అనుమతులు లేవు, చట్ట విరుద్ధంగా అనుమతిచ్చారని చెప్పి ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చి వేసింది. రుషికొండపై జగన్‌ నిర్మించిన రాజ్‌మహల్‌కు ఏం అనుమతులు ఉన్నాయో అందరూ ఆలోచించాల్సిన అవసరముంది. టూరిజం తరఫున నిర్మాణాలు చేపట్టామని న్యాయస్థానాలను కూడా బురిడీ కొట్టించే విధంగా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పర్యాటకశాఖ మంత్రి అత్యంత గోప్యంగా నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సద్దాం హుస్సేన్‌, బెంగళూరులో గాలి జనార్థన్‌లాంటి వారి విలాసవంతమైన భవనాల్లోనే అధునాతన వసతులు ఉన్నట్టు మీడియాలో చూసేవాళ్లం. ప్రస్తుతం రుషికొండపై ఉన్న భవనాల్లో వాటిని తలదన్నే విధంగా వసతులు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.450 కోట్లు వెచ్చించి విలాసవంతమైన భవనం నిర్మించినా ఒక్కసారి కూడా చూడకుండానే జగన్‌ సీఎం పదవి నుంచి దిగి పోయారు’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని