Congress Presidential Polls: బరి నుంచి వైదొలగిన గహ్లోత్‌.. రేసులో ఉన్నది వీళ్లే..!

కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్లు సమర్పించడానికి కూడా రేపే ఆఖరి తేదీ. అంతిమంగా ఎవరెవరు బరిలోకి దిగుతారన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మరోవైపు రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో తాను బరి నుంచి వైదొలగుతున్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఇవాళే ప్రకటించారు...

Published : 29 Sep 2022 18:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్లు సమర్పించడానికి కూడా రేపే ఆఖరి తేదీ. అంతిమంగా ఎవరెవరు బరిలోకి దిగుతారన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మరోవైపు రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో తాను బరి నుంచి వైదొలగుతున్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఇవాళే ప్రకటించారు. మరో పక్క తాను పోటీ చేస్తున్నట్లు శశిథరూర్‌ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా తాను బరిలోకి దిగనున్నట్లు సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించారు. వీరిద్దరితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

1. శశిథరూర్‌

కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి పోటీ చేస్తున్నట్లు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ గతంలోనే ప్రకటించారు. తాజా సమాచారం మేరకు రేపు ఉదయం ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. గత శనివారమే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన నామినేషన్‌ పత్రాలు తెప్పించుకున్నారు. పార్టీ నేతల మద్దతు తనకే ఉంటుందని శశిథరూర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, గాంధీ కుటుంబ సభ్యుల మద్దతును కూడగట్టుకోలేక పోవడం ఈయనకు వ్యతిరేక అంశం.

2.దిగ్విజయ్‌ సింగ్‌

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే... తాను బరిలోకి దిగుతున్నట్లు దిగ్విజయ్‌ సింగ్‌ వెల్లడించారు.  అయితే ఈ నిర్ణయం తనకు తానుగా తీసుకున్నదేనని , అధినేత్రి సోనియాతో మాట్లాడలేదని ఆయన అన్నారు. మరోవైపు రేపు ఉదయమే నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబ సభ్యుల మద్ధతు కూడా ఈయనకు ఉందనే చెప్పాలి. దీంతో ప్రధాన పోటీదారుగా ఈయనే నిలిచే అవకాశముంది.

3. మల్లిఖార్జున ఖర్గే

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో ఉన్నవారిలో పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పేరు కూడా వినిపిస్తోంది. ఒకవేళ గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయాలని కోరినా.. ఖర్గేకు ఇష్టం లేదని గతంలో ఓ వార్త సంస్థ వెల్లడించింది. తాజా పరిస్థితుల్లో ఆయన నిర్ణయం మార్చుకుంటారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే పార్టీ నిర్ణయానికి లోబడి పని చేస్తానని అధినేత్రి సోనియాతో ఖర్గే చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిని బట్టి ఖర్గే కూడా రేపు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదు.

4. పవన్‌ బన్సల్‌

పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్‌ బన్సల్‌ ఇప్పటికే రెండు సెట్ల నామినేషన్‌ తీసుకున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత మధుసూదన్‌ మిస్త్రీ మంగళవారం తెలిపారు. అయితే అవి ఆయన కోసమేనేనా? లేదా వేరెవరికోసమో తీసుకున్నారా? అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు తాను అధ్యక్ష ఎన్నికల బరిలో లేనని బన్సల్‌ చెబుతున్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం మార్చుకునే అవకాశముంది.

5. కమల్‌నాథ్‌

రాజస్థాన్‌లో నెల కొన్న సంక్షోభం నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ అధిష్ఠానం హుటాహుటిన దిల్లీకి పిలిపించింది. గహ్లోత్‌కి సర్ది చెప్పేందుకే ఆయన్ని హస్తినకు రప్పించారని వార్తలు వచ్చాయి. మరోవైపు సోనియా గాంధీతో భేటీ తర్వాత కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికకు పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. దీంతో బరిలోకి దిగాల్సిందిగా కమల్‌నాథ్‌ను సోనియా గాంధీ కోరినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. కాగా, తాజాగా బరి నుంచి వైదొలగినట్లు గహ్లోత్‌ ప్రకటించిన నేపథ్యంలో కమల్‌నాథ్‌ కూడా పోటీ చేయవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

వీరితోపాటు పార్టీ సీనియర్‌ నేతలు ముకుల్‌ వాస్నిక్‌, సుశీల్‌ కుమార్‌ శిందే, కుమారి సెల్జా తదితరుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు అక్టోబర్‌ 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీ సమాయత్తమవుతోంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి శుక్రవారమే చివరి రోజు. అక్టోబరు 8 సాయంత్రం 5 గంటలకు నామినేష్లను ఉపసంహరించుకునేందుకు వీలుంది. ఒక వేళ ఎన్నిక అనివార్యమై పోలింగ్‌ జరిగినట్లయితే.. ఫలితాలను అక్టోబరు 19న వెల్లడించనున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts