
‘‘సచిన్ పైలట్‌కు పార్టీ నడిపే సామర్థ్యం లేదు’’
మరోసారి ఆరోపించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
జైపూర్: కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భారతీయ జనతా పార్టీతో కలిసి సచిన్ పైలట్ గత ఆరునెలలుగా కుట్రలు చేస్తున్నారని మరోసారి విమర్శించారు. ఇదే విషయాన్ని ఇదివరకే నేను పలుమార్లు చెప్పినప్పటికీ ఎవ్వరూ నమ్మలేదని అన్నారు. ఇంగ్లీషు, హిందీ భాషలపై పట్టున్న వ్యక్తి, ఇంతటి అమాయకంగా కనిపించే వ్యక్తి ఈ విధంగా చేస్తారని ఎవరూ అనుకోరని అశోక్ గహ్లోత్ అన్నారు. ఈ సందర్భంలో నేను కూరగాయలను విక్రయించడానికి ఇక్కడ లేను, నేను ముఖ్యమంత్రిని అని అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. తాజాగా జైపూర్‌లో మీడియాతో అశోక్ గహ్లోత్ మాట్లాడారు. సచిన్‌పైలట్‌కు సరైన శక్తి సామర్థ్యాలు లేవని.. అయినప్పటికీ పార్టీ అధినేతగా ఉన్నందున అతన్ని ఎన్నడూ అగౌరవపరచలేదని అన్నారు. పార్టీని నడిపించడానికి పనికిరాడని తెలిసినప్పటికీ రాష్ట్ర పార్టీపగ్గాల నుంచి అతన్ని తప్పించాలని గడిచిన ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. కేవలం సచిన్‌పైలట్‌ను కాంగ్రెస్ పార్టీకి ఆస్తిగా భావించామని అన్నారు.
ప్రస్తుతం స్పీకర్ నోటీసులను సవాలు చేస్తూ సచిన్ పైలట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికోసం ఇద్దరు న్యాయవాదులు పనిచేస్తున్నారు. లక్షల్లో ఫీజు వసూలు చేసే వీరికి ఇంత డబ్బు సచిన్ పైలట్ ఎక్కడనుంచి తెచ్చి ఇస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.