అందుకే మూడు రాజధానుల నిర్ణయం: మోపిదేవి

రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణతోపాటు అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేలా బోస్టన్‌ నివేదిక ఉందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే సమయమిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Published : 04 Jan 2020 17:53 IST

విజయవాడ: రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణతోపాటు అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేలా బోస్టన్‌ నివేదిక ఉందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే సమయమిదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోపిదేవి స్పష్టం చేశారు. గతంలో కేవలం హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయటం వల్ల ఇతర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని  మోపిదేవి గుర్తు చేశారు. అందువల్ల ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.

మరోవైపు అమరావతి ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని చాలా మందిలో అపోహలు ఉన్నాయని, అలాంటి అభిప్రాయం అవసరం లేదని సీఎం చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే దాన్ని రాజకీయం చేయొద్దని తెదేపా నేతలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

కేవలం రాజధాని కోసమే లక్షలాది కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని? ఆయన నిలదీశారు. హైపవర్‌ కమిటీ జనవరి 6వ తేదీ సమావేశం అవుతుందని, జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని ఆయన వివరించారు. రెండు నివేదికలు ఒకే విధంగా ఉన్నంత మాత్రాన ఒకరి ప్రభావం పడినట్టు కాదని మోపిదేవి తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని మహిళలపై పోలీసుల తీరుపై మంత్రి స్పందించారు. మహిళలకు ఇబ్బంది కలిగించాలని వైకాపా ప్రభుత్వం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. అందుకే పోలీసులు అలా వ్యవహరించి ఉండొచ్చని మంత్రి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని