ఉద్ధవ్‌ ప్రభుత్వంపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీది అసహజ కూటమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని.......

Published : 06 Jan 2020 01:30 IST

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీది అపవిత్ర కూటమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. సీఏఏకి మద్దతుగా భాజపా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనిక్కడ మీడియాతో మాట్లాడారు.

‘‘వారి కూటమిని అపవిత్రంగా ఏర్పడింది. ఇవాళే ఒక మంత్రి రాజీనామా చేశారు. ఈ ప్రభుత్వం దానంతట అదే పడిపోతుంది. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ మధ్య ఎలాంటి సైద్ధాంతిక సారుప్యతలు లేవు’’ అని గడ్కరీ అన్నారు. గతంలో శివసేన వ్యవస్థాపకులు బాల్‌ఠాక్రే బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులు ముంబయి నుంచి తరిమేయాలని కోరుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం సీఏఏని వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. హిందుత్వం, మరాఠా అస్థిత్వాన్ని వీడితే పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి శివసేన గురికావాల్సి ఉంటుందని గడ్కరీ అన్నారు.

మంత్రి పదవుల కేటాయింపు విషయంలో మూడు పార్టీల మధ్య విభేదాలు చెలరేగాయన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో శివసేన ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ శివసేన వాటిని కొట్టివేసింది. ఆదివారం ఆయనను రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా నియమించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని