అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: పవన్‌

రాజధాని రైతులు ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. చినకాకాని వద్ద రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు...

Updated : 08 Jan 2020 11:39 IST

అమరావతి: రాజధాని రైతులు ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. చినకాకాని వద్ద రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. రైతులను, మహిళల్ని భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. నిరసనలు ప్రారంభం కాకముందే తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ను గృహనిర్బంధంలో ఉంచారన్నారు. పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్‌ను కారణం చెప్పకుండానే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుందన్నారు. చినకాకానిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై ఆయన మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘అమరావతి నుంచి రాజధానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. విశాఖ వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనబడటంలేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుబాటుతనం ఉంది. అక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ప్రణాళికల్లేవు. రాయలసీమ వాసులకీ విశాఖ అంటే దూరాభారం అవుతుంది. సీమ నుంచి విశాఖ వెళ్లాలంటే ప్రయాణం ఎంతో కష్టతరం. ఈ విషయమై సీమవాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను వైకాపా ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది’’

‘‘రాజధాని మార్పు అనేది ఉద్యోగులకీ ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తోంది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. వాళ్లను మళ్లీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలు ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతాయి. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోంది. ఎవరికీ సంతృప్తి కలిగించడంలేదు. తాము భూములు త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉంచాలని అమరావతి ప్రజలు కోరుతున్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్దంపట్టింది. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఆందోళనల్ని అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలి’’ అని పవన్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని