అచ్చుతప్పుతో మంత్రిత్వ శాఖే మారింది..

మహారాష్ట్రలో మంత్రిత్వ శాఖల కేటాయింపుల తర్వాత కాంగ్రెస్‌ మంత్రి విజయ్‌ వాడెత్తివార్‌ కొంత అసంతృప్తికి గురయ్యారు. అయితే దీనికి కారణం ‘అచ్చుతప్పు’ అని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్పీపీ నేత అజిత్‌

Published : 09 Jan 2020 13:28 IST

ముంబయి: మహారాష్ట్రలో మంత్రిత్వ శాఖల కేటాయింపుల తర్వాత కాంగ్రెస్‌ మంత్రి విజయ్‌ వాడెత్తివార్‌ కొంత అసంతృప్తికి గురయ్యారు. అయితే దీనికి కారణం ‘అచ్చుతప్పు’ అని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్పీపీ నేత అజిత్‌ పవార్ తాజాగా వెల్లడించారు. ప్రిటింగ్‌లో జరిగిన పొరబాటు కారణంగా విజయ్‌కి ఓ శాఖకు బదులుగా మరో మంత్రిత్వశాఖ వచ్చిందన్నారు. 

సంకీర్ణ మంత్రులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మంత్రిత్వశాఖల తుది జాబితాలో కాంగ్రెస్‌ నేత విజయ్‌కి భూకంప పునరావాస మంత్రిత్వశాఖను కేటాయించినట్లుగా ఉంది. దీంతో తనకు కేటాయించిన శాఖపై విజయ్‌ అసంతృప్తికి గురైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అజిత్‌ పవార్‌ స్పందించారు. ‘నిజానికి విజయ్‌కి రిలీఫ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ మంత్రిత్వశాఖ రావాలి. జాబితాలో ఆయనకు భూకంప పునరావాస మంత్రిత్వశాఖ కేటాయించినట్లు వచ్చింది. ఇది చూసి విజయ్‌ అసంతృప్తికి గురయ్యారు. అయితే ఆయన మంత్రిత్వశాఖను తప్పకుండా మారుస్తామని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆయనకు హామీ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. 

శాఖల కేటాయింపుల్లో ప్రతి పార్టీకి ప్రాధాన్యం కల్పించామని, సమర్థులైన నాయకులకు ఆయా మంత్రిత్వ బాధ్యతలు అప్పజెప్పామని అన్నారు. ఒక్క విజయ్‌ విషయంలోనే ప్రింటింగ్‌ పొరబాటు జరిగిందని వెల్లడించారు. ఇటీవల మహా కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయిన విషయం తెలిసిందే. శివసేనకు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీకి కీలక శాఖలు దక్కాయి. అజిత్‌ పవార్‌కు ఆర్థికశాఖ బాధ్యతలను అప్పగించగా.. ఎన్సీపీకి చెందిన మరో నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ కేటాయించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని