తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు

తెలంగాణలో పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగిసింది. ఎన్నికలు జరగనున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ్టితో..

Published : 11 Jan 2020 00:34 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగిసింది. ఎన్నికలు జరగనున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగియగా రేపు పరిశీలన ప్రక్రియ చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 వరకు గడువు ఉంది. ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించి 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు బీ-ఫారాల విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేవరకు బీ-ఫారాలు ఇవ్వచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు బీ-ఫారాలు సమర్పించవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదటిరోజు 967 నామినేషన్లు దాఖలు కాగా.. రెండో రోజు 4,722 నామినేషన్లు దాఖలయ్యాయి. కొంత మంది అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు సమర్పించారు.

కరీంనగర్‌లో 12 వరకు నామినేషన్లు స్వీకరణ
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొదట కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ స్థానికంగా రిటర్నింగ్ అధికారులు ఎన్నిక నోటీసు జారీ చేశారు. కరీంనగర్‌లో కార్పొరేటర్ పదవుల కోసం ఉదయం 10.30 గంటల నుంచి నామ పత్రాలు స్వీకరించారు. అక్కడ ఈనెల 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని