భార్య ఆదేశం.. కార్యకర్తలారా మా ఇంటికొద్దు

‘ఎన్సీపీ కార్యకర్తలారా.. నన్ను కలిసేందుకు మా ఇంటికి రాకండి’ అంటున్నారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌. అజిత్‌కు ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇల్లు చిన్నదిగా ఉండటం..

Published : 11 Jan 2020 17:20 IST

పుణె: ‘ఎన్సీపీ కార్యకర్తలారా.. నన్ను కలిసేందుకు మా ఇంటికి రాకండి’ అంటున్నారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌. అజిత్‌కు ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇల్లు చిన్నదిగా ఉండటం.. తరచూ కార్యకర్తలు రావడంతో అజిత్‌ భార్య సునేత్ర పవార్‌ చాలా కోపంగా ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. 

తన అసెంబ్లీ నియోజకవర్గమైన బారామతిలో జరిగిన ఓ కార్యక్రమానికి అజిత్‌ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ కార్యకర్తలకు ఓ అభ్యర్థన చేశారు. ‘చాలా ముఖ్యమైన పని ఉంటే తప్ప కార్యకర్తలు నన్ను కలవడానికి ముంబయికి రావొద్దు. నాకు ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదు. ప్రస్తుతం నేను ఉంటున్న ఇంట్లో సమావేశం గది లేదు. దీంతో నన్ను కలవడానికి వచ్చే కార్యకర్తలతో డైనింగ్‌ రూంలో గానీ.. పడకగదిలో గానీ సమావేశమవ్వాల్సి వస్తోంది. పెద్ద ఇల్లు కేటాయిస్తే గానీ ఇక్కడ ఉండనని నా భార్య సునేత్ర స్పష్టంగా చెప్పింది’ అని అజిత్‌ పవార్‌ చెప్పుకొచ్చారు. 

ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజిత్‌ తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని స్కూళ్లలో మరాఠీ తప్పనిసరి చేసే విషయంపై ప్రభుత్వం పరిశీలనలు చేస్తోందని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని