దేశంలో హింసకు వామపక్షాలే కారణం: యోగి

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ దేశంలోని వామపక్ష పార్టీలపై శనివారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలో హింసాత్మక వాతావరణం చెలరేగడానికి కారణం వారేనని మండిపడ్డారు.

Published : 12 Jan 2020 01:04 IST

గ్వాలియర్‌: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ దేశంలోని వామపక్ష పార్టీలపై శనివారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలో హింసాత్మక వాతావరణం చెలరేగడానికి కారణం వారేనని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)కు మద్దతుగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జనజాగరణ్‌ మంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాజాగా జేఎన్‌యూలో జరిగిన దాడులను ఉద్దేశిస్తూ.. వామపక్ష పార్టీలే దేశంలో హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. వారు పరీక్షలకు అంతరాయం కలిగించేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని దిల్లీ పోలీసులు కనుగొన్నట్లు విమర్శించారు. ఇది సీఏఏకు మద్దతుగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన సమయమన్నారు. సీఏఏ, జేఎన్‌యూ ఘటన విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు వార్తలు ప్రచారం చేసి ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నట్లు ఆయా పార్టీలను ఎండగట్టారు. దేశంలో ముగింపు దశకు చేరుకున్న ఉగ్రవాదం, వేర్పాటువాదం మళ్లీ (జేఎన్‌యూ, సీఏఏ నిరసనలు వంటి ఘటనలతో) కొత్తగా జీవం పోసుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం పౌరులకు హక్కులను కల్పించింది. కానీ పౌరులు కూడా తమ విధులను నిర్వర్తించాలని కోరారు. 

దిల్లీలోని జేఎన్‌యూలో గత ఆదివారం కొందరు దుండగులు మాస్కులు ధరించి విద్యార్థులు అధ్యాపకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 34 మందికి పైగా గాయాల పాలయ్యారు. కాగా శుక్రవారం ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని