కాంగ్రెస్‌పై ప్రశాంత్‌ కిశోర్‌ ప్రశంసల వర్షం

భాజపా ప్రభుత్వం తెస్తున్న పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికను నిరసిస్తూ మిత్రపక్షం జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నూతన స్వరం అందుకున్నారు. బిహార్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండింటినీ అమలు చేసేది లేదని చెప్పారు. అంతేకాకుండా  సీఏఏ, ఎన్‌ఆర్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌...

Published : 12 Jan 2020 18:21 IST

దిల్లీ: భాజపా ప్రభుత్వం తెస్తున్న పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికను నిరసిస్తూ మిత్రపక్షం జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నూతన స్వరం అందుకున్నారు. బిహార్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండింటినీ అమలు చేసేది లేదని చెప్పారు. అంతేకాకుండా  సీఏఏ, ఎన్‌ఆర్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఆయన అభినందించారు. ఆ పార్టీ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీలపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన పోరాడే తీరు అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన పోస్టు చేశారు.

పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబి)ను పార్లమెంట్‌లో వ్యతిరేకించిన భాజాపా మిత్రపక్షం జేడీయూ.. ఎన్‌ఆర్సీపై స్తబ్దుగా వ్యవహరిస్తోంది. అయితే ఎన్‌ఆర్సీకి తొలిమెట్టుగా భావిస్తున్న ఎన్‌పీఆర్‌ కోసం మాత్రం గత నెలలో నితీశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే కూటమి నిలబడాలనే ఉద్దేశంతో ఎన్‌పీఆర్‌కు నితీశ్‌ అంగీకరించారని, ఎన్‌ఆర్సీతో సమస్య ఉండబోదని జేడీయూకు చెందిన కొంతమంది నాయకులు భావిస్తున్నారు. కానీ,  ఒక వేళ భాజపాకు మద్దతు పలుకుతూ పోతే భవిష్యత్‌లో పార్టీ ప్రాభవం కోల్పోతుందనే ఉద్దేశంతోనే ఎన్ఆర్సీని వ్యతిరేకించాల్సిందిగా ముఖ్యమంత్రి నితీశ్‌పై ప్రశాంత్‌కిశోర్‌ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఏఏ, ఎన్‌ఆర్సీలను కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒక వేళ ఇవి అమల్లోకి వస్తే ప్రజల మధ్య విభజన వాతావరణ నెలకొంటుందని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది.
ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలోనూ ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ అంశంపై చర్చించారు.  సీఏఏ అన్నది కేవలం ప్రజలను విభజించడానికి తీసుకొస్తున్న అంశమేనని, మతాల పేరిట ప్రజలను విభజించాలనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె పార్టీ నేతలకు చెప్పారు. అంతేకాకుండా ఎన్‌పీఆర్‌ 2020 అనేది ఎన్‌ఆర్సీకి మరోరూపమని ఆమె వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని