Published : 14 Jan 2020 00:45 IST

వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

దిల్లీ: ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌ షా తమ ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. సోమవారం కాంగ్రెస్‌ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్ష పార్టీలతో జరిగిన సమావేశంలో పౌరసత్వ చట్టం, ఎన్సార్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  చర్చించారు. 

‘ఎన్సార్సీ, సీఏఏ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. అది ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో బహిర్గతమవుతోంది. నిరసన వ్యక్తం చేస్తున్న వారి పట్ల యూపీ, దిల్లీ ప్రాంతాల్లోని పోలీసులు వ్యవహరించిన తీరు షాక్‌కు గురి చేసింది. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే వాళ్లు మాట్లాడిన మాటలను మార్చేశారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో మోదీ-షా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ విషయం జేఎన్‌యూ ఘటన ద్వారా బహిర్గతమైంది. జేఎన్‌యూ తర్వాత జామియా, బీహెచ్‌యూ, అలహాబాద్‌ యూనివర్సిటీ, ఏఎంయూలో తలెత్తిన పరిస్థితులే అందుకు నిదర్శనం’ అని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్థికమందగమనం నుంచి దేశాన్ని రక్షించాల్సింది పోయి.. దాని గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశ ఆర్థిక పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుందని ఆమె దుయ్యబట్టారు. 

20 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, లెఫ్ట్‌ నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, ఝార్ఖండ్‌ సీఎం, జేఎంఎం నేత హేమంత్‌ సోరేన్‌, ఎల్‌జేడీ అధినేత శరద్‌ యాదవ్‌, ఉపేంద్ర కుష్వాహా, ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత హసనైన్‌ మసూదితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే నేతలు ఈ భేటీకి హాజరుకాలేదు. ఇక సరైన సమాచారం లేకపోవడం వల్లే తాము హాజరు కాలేదని శివసేన తెలిపింది. ప్రతిపక్షాల ఐక్యత చాటే ఉద్దేశంతో పిలుపునిచ్చిన ఈ సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉండటం గమనార్హం. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని