
సీఎం అవుతారనే వ్యాఖ్యలపై కేటీఆర్ కామెంట్
మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా మున్సిపల్ ఎన్నికలు తనకు సవాలు వంటివని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈ సందర్భంగాపలు కీలక విషయాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్ మనసులో ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయన్న కేటీఆర్.. సందర్భానుసారంగా వాటిని అమలు చేయనున్నట్టు తెలిపారు. తాను సీఎం అవుతారంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. ఈ అంశంపై మీడియా వాళ్లే మంత్రులతో మాట్లాడిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్, భాజపా కలిసి పనిచేస్తూ పైకి డ్రామాలాడుతున్నాయి. తెరాస సర్కార్ హయాంలో పట్టణాల అభివృద్ధి జరుగుతోంది. రూ.8వేల కోట్లతో 2లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఐదేళ్లలో కేంద్రం నుంచిఅదనపు నిధులు ఏమైనా తీసుకొచ్చారా? ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. 25 పట్టణాల్లో కాంగ్రెస్, భాజపా పూర్తిస్థాయిలో అభ్యర్థుల్ని నిలబెట్టలేదు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ వెలుగులు తీసుకొచ్చింది తెరాస ప్రభుత్వమే. రాష్ట్రంలో 90 మినీ ట్యాంక్ బండ్‌లు నిర్మించాం. హైదరాబాద్ చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశాం’’ అని వివరించారు.