కేంద్రం జోక్యం చేసుకుంటుంది: సుజనా

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని భాజపా ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా

Updated : 18 Jan 2020 14:13 IST

దిల్లీ: వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని భాజపా ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పనిచేయడం సరికాదన్నారు. ఎయిమ్స్‌, నిఫ్ట్‌ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని తెలిపారు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్‌-6లో స్పష్టంగా ఉందన్నారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం పరిపాలనపై దృష్టిపెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోమని, రాష్ట్ర ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనాచౌదరి తెలిపారు.

అందరూ వ్యతిరేకించాలి...
‘‘అమరావతి తరలింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగుతున్నాయి. కొందరు రైతులు ఆందోళనతో చనిపోయారు. అమరావతి తరలింపును అందరూ వ్యతిరేకించాలి. సీఆర్డీఏను తొలగించేందుకు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. రాజు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన తీర్పులే ఇందుకు ఉదాహరణ. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని 13 జిల్లాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తే మంచిది. మనీ బిల్లుగా సీఆర్డీఏని తీసుకొస్తామంటే  అయ్యే పనికాదు. అమరావతిలో పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వైకాపా ప్రజాప్రతినిధులే సంతోషంగా లేరు. సీఎం పదవిలో ఎవరు ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారు. రాజధాని ఒక్క అంగుళం కూడా జరగదు. అమరావతి తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి తలెత్తుతుంది. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాలి, అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని సుజనా చౌదరి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు