పది హామీలతో ఆప్‌ గ్యారెంటీ కార్డు విడుదల

దిల్లీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ పది ముఖ్యమైన హామీలతో గ్యారెంటీ కార్డును ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్‌ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు.

Updated : 19 Jan 2020 17:09 IST

దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ పది ముఖ్యమైన హామీలతో గ్యారెంటీ కార్డును ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్‌ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్లీ వాసులకు ప్రధానంగా అవసరమైన సదుపాయాల్ని కచ్చితంగా నెరవేర్చేందుకు ‘పది హామీలతో గ్యారెంటీ కార్డును’ ఓటర్లకు విడుదల చేశారు. ఉచిత కరెంటు, 24 గంటలు నీటి సరఫరా, ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్య ఆ హామీల్లో ముఖ్యమైనవి. వాటితో పాటు కాలుష్య రహిత పర్యావరణం, యమునా నది ప్రక్షాళన, బస్తీల్లో ఉండే వారికి పక్కా గృహాలు ఆ హామీల్లో ఉన్నాయి. మరోవైపు దిల్లీ కాలుష్య కారణంగా గ్యాస్‌ ఛాంబర్‌లా మారిపోతున్న నేపథ్యంలో దాన్ని 300శాతం తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ కార్డులో పొందుపరిచారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది మా మేనిఫెస్టో కాదు. సమగ్ర మేనిఫెస్టో 7 లేదా 10 రోజుల్లో వస్తుంది. ఈ పది సమస్యలు దిల్లీ ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. వీటికి పరిష్కారం అమలు చేస్తామని హామీ ఇస్తూ గ్యారంటీ కార్డు విడుదల చేస్తున్నాం. మార్చి 31తో గతంలో మేం అమలు చేసిన పథకాలు గడువు ముగుస్తాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ మేం మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో పొందుపరచబోయే అంశాలు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తాయి’ అని తెలిపారు. 

2015 ఎన్నికల్లో ఆప్‌ 70 స్థానాలకు గానూ 67 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానాల్లోనూ విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 46 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుండగా.. 24 మంది కొత్త అభ్యర్థులు పోటీచేయనున్నారు. దిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు