గ్రాఫిక్స్‌ సిటీగానే అమరావతి: కన్నబాబు

లక్ష కోట్ల రూపాయలతో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఐదేళ్లలో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి కన్నబాబు అన్నారు.  సినిమా డైరెక్టర్లతో సెట్టింగులు వేయించారని

Updated : 20 Jan 2020 15:05 IST

అమరావతి: లక్ష కోట్ల రూపాయలతో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఐదేళ్లలో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి కన్నబాబు అన్నారు. సినిమా డైరెక్టర్లతో సెట్టింగులు వేయించారని, డిజైన్ల పేరిట నాలుగేళ్ల కాలం వృథా చేశారని ఆయన ఆరోపించారు.  దీంతో అమరావతి గ్రాఫిక్స్‌ సిటీగా మిగిలిపోయిందన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సూపర్‌ కేపిటల్‌ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. గ్రీన్‌ఫీల్డ్‌, ఉన్న నగరం అభివృద్ధి చేయడం, పాలనా వికేంద్రీకరణ చేయడం వంటి మూడు ఐచ్ఛికాలు ఇచ్చింది. కానీ, గత ప్రభుత్వం సినిమా డైరెక్టర్లతో సెట్టింగులు వేయించింది. డిజైన్ల పేరిట నాలుగేళ్లు కాలం వృథా చేసింది. ఐదేళ్లలో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. చంద్రబాబు కల నెరవేరాలంటే వారు చెప్పినట్లుగా 35 ఏళ్లు పడుతుంది. అమరావతి నిర్మిస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.

‘‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవడమే సమస్యలకు మూల కారణం. తమ ప్రాంతం అభివృద్ధి కాలేదన్న కారణంతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణే శరణ్యమని రెండు కమిటీలు నివేదిక ఇచ్చాయి. శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు కూడా ఇవే విషయం చెప్పాయి. అన్ని ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవం కోసమే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కొంతమందికే కలల రాజధాని. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉంది. గతంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఇదే వ్యక్తి జోలె ఎందుకు పట్టలేదు’’ అని ప్రశ్నించారు.  చంద్రబాబు దురాశ వల్ల అభివృద్ధి నిలిచిపోయిందని, నిధులు ఇవ్వలేమని ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు మత్స్యకారుల గ్రామమైన విశాఖ..  నేడు మహా నగరంగా విరాజిల్లుతోందన్నారు. అలాంటి విశాఖకు మావోయిస్టు ప్రభావం ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని కన్నబాబు అన్నారు. హైదరాబాద్‌ సమీపంలోనే నాటి మంత్రి మాధవరెడ్డిని హత్య చేయలేదా?.. అంతమాత్రాన హైదరాబాద్‌ నుంచి రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని