అప్పుడు నేనూ సంతోషించా, కానీ..: ఆర్కే

రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఈ ప్రాంత వాసిగా తానూ సంతోషించానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ, ఇక్కడ జరిగింది ...

Updated : 20 Jan 2020 15:57 IST

అమరావతి: రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఈ ప్రాంత వాసిగా తానూ సంతోషించానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ, ఇక్కడ జరిగింది తెలుసుకుని మోసపోయామని గ్రహించానని చెప్పారు. రాజధానుల అంశంపై ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతిని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే జగన్‌ అసెంబ్లీలో బయటపెట్టారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా జరిగిన రూ.వేల కోట్ల అవినీతిని బయటకు రానీయకుండా గత ప్రభుత్వం.. జగన్‌, వైకాపా గొంతును నొక్కేసింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో 29 గ్రామాలున్నాయి. ఈ ప్రాంతంలో రాజధాని అని చెప్పిన రోజు సంతోషించిన వారిలో నేనూ ఒకడిని. వాస్తవాలు తెలుసుకునే సరికి మేం మోసపోయాం అని గ్రహించాం. రాజధానికి 30వేల ఎకరాలు కావాలంటే సమర్థించాం.. కానీ అది ప్రభుత్వ భూమి అయ్యుండాలని నాడు జగన్‌ చెప్పారు. కానీ దాన్ని వక్రీకరించి నాడు జగన్‌ అంగీకరించి నేడు వ్యతిరేకిస్తున్నారంటూ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’’ అని అన్నారు.

‘‘గత ఐదేళ్లలో తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో రైతులను చంద్రబాబు కంటిమీద కునుకుమీద లేకుండా చేశారు. కౌలు రైతు వ్యవస్థను నాశనం చేశారు. రైతు కూలీలు రోడ్డున పడ్డారు. పర్యావరణ చట్టానికి ఈ ప్రాంతం వ్యతిరేకమని తెలిసినా ఈ ప్రాంతాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. కానీ నేడు అందరి అనుమతితోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం మొత్తం మూడు కమిటీలు వేశారు. రైతుల కౌలును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతుల గురించి కూడా ఆలోచన చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్నే ప్రజల ముందుంచాం. అలాంటప్పుడు సెక్రటేరియట్‌ ఎక్కడుంటే ఏమిటి? హైకోర్టు ఎక్కడుంటే ఏమిటి? నెల రోజుల నుంచి చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బయటపడుతోందనని భయపడుతున్నారు. ఆయన బినామీలను కాపాడుకోవడానికే ఈ ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ప్రజలు రాకపోవడంతో బయట నుంచి తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని