ఏ జీవో ప్రకారం బోస్టన్‌ కమిటీ..?: తెదేపా

రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో భూములు ఇచ్చిన రైతుల్లో 24 మంది చనిపోయారని.. వారి మృతికి సంతాప సూచకంగా సభలో రెండు నిమిషాలపాటు ...

Published : 20 Jan 2020 16:07 IST

అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో భూములు ఇచ్చిన రైతుల్లో 24 మంది చనిపోయారని.. వారి మృతికి సంతాప సూచకంగా సభలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని తెదేపా డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో స్పీకర్‌ అనుమతివ్వాలని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు కోరారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి, పోలవరం నిర్మాణమే రెండు కళ్లుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో అమరావతిని పెకలించివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని చెప్పారు. విభజన అనంతరం రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకుండా అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారన్నారు. అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమకు మధ్యలో ఉన్న గుంటూరు-విజయవాడ ప్రాంతం అనుసంధానానికి సులువుగా ఉంటుందని శివరామకృష్ణన్‌ కమిటీ తమ నివేదికలోని 12వ పేజీలో పేర్కొందని గుర్తు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ కూడా అమరావతికి ఆమోదం తెలిపారని రామానాయుడు చెప్పారు. 

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై అసత్య ప్రచారాలు చేసిందని రామానాయుడు ఆరోపించారు. ఏ జీవో ప్రకారం బోస్టన్‌ గ్రూప్‌ కమిటీని నియమించారని ఆయన ప్రశ్నించారు. ఆ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదని..వారు ఇచ్చింది తప్పుడు నివేదిక అని చెప్పారు. ఒక సామాజిక వర్గానికే అమరావతి ఉపయోగపడుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 75 శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని రామానాయుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు