దిల్లీ ఫైట్‌కు జేజేపీ  దూరం

దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు భాజపా మరో మిత్రపక్షం దూరంగా ఉంటోంది. హరియాణాలో భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) దిల్లీ శాసనసభ

Published : 22 Jan 2020 01:42 IST

దిల్లీ: దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు భాజపా మరో మిత్రపక్షం దూరంగా ఉంటోంది. హరియాణాలో భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) దిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించింది. జేజేపీ ఎంపిక చేసుకున్న గుర్తును ఎన్నికల సంఘం మరొకరికి కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధినేత దుశ్యంత్‌ చౌటాలా వెల్లడించారు. 

‘పార్టీకి ఎన్నికల గుర్తు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇంత తక్కువ సమయంలో కొత్త గుర్తుపై పోటీ చేసేందుకు మేం ఆసక్తిగా లేం. అందుకే ఎన్నికల బరిలో మా పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపట్లేదు’ అని దుశ్యంత్‌ చౌటాలా మంగళవారం వెల్లడించారు. దిల్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు   ‘తాళం’ లేదా ‘చెప్పు’ గుర్తు కేటాయించాలని జేజేపీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. అయితే ఈ రెండు గుర్తులను ఈసీ వేరే వారికి కేటాయించింది. 

ఇప్పటికే భాజపా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) దిల్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పౌరసత్వ చట్టం, సీట్ల పంపకాల విషయంలో భాజపా, శిరోమణి అకాలీదళ్‌ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఎస్‌ఏడీ నిన్న ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోపే భాజపా మరో మిత్రపక్ష పార్టీ అయిన జేజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు దూరమవుతున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. భాజపా 67 స్థానాల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగింది. మిగతా మూడు స్థానాలను తమ మిత్రపక్షాలకు వదిలేసింది. రామ్‌ విలాస్‌ పాసవాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ, నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూకు టికెట్లు ఆఫర్‌ చేసినట్లు భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ఇటీవల వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు