మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై వాడీవేడి చర్చ

శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. సభలో మాట్లాడేందుకు మండలి ఛైర్మన్‌... తెదేపా సభ్యులకు 84 నిమిషాలు, తెదేపా

Published : 22 Jan 2020 13:14 IST

అమరావతి: శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. సభలో మాట్లాడేందుకు మండలి ఛైర్మన్‌... తెదేపా సభ్యులకు 84 నిమిషాలు, తెదేపా నామినేటెడ్‌ సభ్యులకు 8 నిమిషాలు, వైకాపా సభ్యులకు 27 నిమిషాలు, స్వతంత్ర సభ్యులకు 9 నిమిషాల సమయం కేటాయించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ... ‘‘అమరావతిలో సీఎం ఒక్క రోజు కూడా పర్యటించలేదు. దాదాపు అన్ని భవనాల నిర్మాణం పూర్తయింది. రాజధాని తరలిస్తే అమరావతిలో పెట్టిన ప్రజాధనం వృథా అవుతుంది. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని కేంద్రం చెబుతోంది. దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవు. మూడు రాజధానులతో ప్రజా ధనం వృథా అవుతుందని ఆదేశ అధ్యక్షుడే చెప్పారు’’ అని లోకేశ్‌ తెలిపారు.

మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... చంద్రబాబు, లోకేశ్‌ ఎప్పడూ సింగపూర్‌, చైనా అమెరికా అన్నారు. మేం మాత్రం వెనుకబడిన ప్రాంతాల గురించే ఆలోచిస్తాం. అమరావతిలో తెదేపా నేతల భూ దోపిడీకి అంతే లేదు’’ అని విమర్శించారు. ఈక్రమంలో అవంతి ప్రసంగానికి తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అడ్డుతగిలారు. సీఎంను తుగ్లక్‌ అనడం సంస్కారమా అని అవంతి ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం కొనసాగింది. మండలిలో సెల్‌ఫోన్‌ చూస్తూ లోకేశ్‌ మాట్లాడటంపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. పరిశీలించి రూలింగ్‌ ఇవ్వాలని మండలి వైస్‌ ఛైర్మన్‌ను కోరారు. దీనిపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం స్పందిస్తూ.. మండలిలో వైఫై సౌకర్యం ఉందని, సెల్‌ఫోన్‌లో నోట్స్‌ చూస్తూ మాట్లాడేతే తప్పేముందన్నారు. అనంతరం లోకేశ్‌ తన ప్రసంగం కొనసాగించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని