‘దమ్ముంటే సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించండి’

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులపై ఏపీ శాసన మండలిలో వాడీవేడి చర్చ కొనసాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. 

Published : 22 Jan 2020 19:02 IST

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై మండలిలో లోకేశ్‌ సవాల్‌

అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులపై ఏపీ శాసన మండలిలో వాడీవేడి చర్చ కొనసాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ కొన్ని భూముల వివరాలు చదివి వినిపించారు. ఈ క్రమంలో కంతేరు వద్ద హెరిటేజ్‌ సంస్థ భూముల విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రాంతం సీఆర్‌డీఏ పరిధిలోనే ఉందని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. దానిలో భాగంగానే రాజధాని ప్రాంతంలోని కర్నూలుకు హైకోర్టు కేటాయించామన్నారు. భాజపా కూడా రాయలసీమ డిక్లరేషన్‌లో కర్నూలుకు హైకోర్టు కేటాయించాలని కోరారన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఉత్తరాంధ్రకు చెందిన కార్మికులు ఉంటున్నారని.. వారికి ఉపాధి అవకాశాలేకపోవడంతోనే వలస వెళ్తున్నారని బుగ్గన చెప్పారు. 

అనంతరం తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ మాట్లాడుతూ హెరిటేజ్‌ భూముల అంశంపై వివరణ ఇచ్చారు. వ్యాపారాన్ని విస్తరించాలని 2014 మార్చి 21న హెరిటేజ్‌ బోర్డు తీర్మానం చేసిందని చెప్పారు. గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో వ్యాపార విస్తరణ చేయాలని వాళ్లు నిర్ణయించారని.. అప్పటికి ఎన్నికలు కూడా జరగలేదన్నారు. ఈ క్రమంలో భూములు కొంటే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా దానిపై ఎందుకు విచారణ జరపలేదని లోకేశ్‌ ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని.. అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్‌ విసిరారు. అదే సమయంలో విశాఖ భూములపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అబద్ధాలు చెప్పి తప్పించుకుంటోందని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts