మండలి పరిణామాలు బాధించాయి:జగన్‌

శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని సీఎం జగన్‌ అన్నారు. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అని చెప్పారు. కానీ తనతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన...

Updated : 23 Jan 2020 19:10 IST

అమరావతి: శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని సీఎం జగన్‌ అన్నారు. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అని చెప్పారు. కానీ తనతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన తంతును అందరమూ చూశామన్నారు. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘గ్యాలరీల్లో తెదేపా అధినేత చంద్రబాబు కూర్చొని జారీ చేసిన ఆదేశాలు చూస్తే మండలి ఛైర్మన్‌ నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని సభ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

అలా చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు

‘‘మండలి ఛైర్మన్‌ ఎలాంటి ప్రసంగం చేశారో రాష్ట్ర ప్రజలంతా చూడాల్సిన అవసరముంది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను మండలి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలా కానిపక్షంలో సభ అభిప్రాయాలను సవరణలతో తిప్పి పంపించవచ్చు. చట్టం చెబుతున్నది కూడా ఇదే. కానీ ఇవేమీ లెక్క చేయకుండా విచక్షణాధికారమని ఛైర్మన్ మాట్లాడారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపే అవకాశమే లేదని ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్‌ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఆలస్యం చేయడం కోసం సెలెక్ట్‌ కమిటీ పంపాలని నిర్ణయం తీసుకున్న విధానం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు శాసన మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అనేదానికి విలువ లేకుండా పోతుంది’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ మండలిలో ఛైర్మన్‌ షరీఫ్‌ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను సభలో ప్రదర్శించారు. 

శాసనమండలి కొనసాగించడంలో ఔచిత్యం లేదు!

ఉన్నత విద్య చదివిన వ్యక్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులు శాసనసభలో ఉన్నారని సీఎం జగన్‌ అన్నారు. ఇంత మందిని ఉంచుకుని శాసన మండలిని కొనసాగించటంలో ఔచిత్యం లేదన్నది అందరి భావనని చెప్పారు. ‘‘మండలి కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికంలో ఉన్న రాష్ట్రంలో మండలి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది మా ప్రశ్న. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మండలిని కొనసాగించాల్సిన అవసరముందా? అనే ఆలోచన కూడా ఉత్పన్నమవుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న మండలి ఇక కొనసాగటం ఎందుకన్న భావన అందరిలోనూ ఉంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

చంద్రబాబు 10 రోజులు విశాఖలో లేరా..?

తప్పు అని తెలిసినా.. తప్పు చేస్తున్నానని మండలి ఛైర్మన్ వ్యాఖ్యానించారని సీఎం జగన్‌ అన్నారు. అన్యాయం జరిగిందని అందరికీ అర్థమవుతోందని, ఇంత జరిగినా తెదేపా అధినేత చంద్రబాబు గ్రామాల్లో తిరగటం, ఆయనకు దండలు వేయటం ఆశ్చర్యంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, ‘సీట్ ఆఫ్ గవర్నెన్స్‌’ అనే పదమే ఉందని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘‘తుపాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు 10 రోజులు విశాఖలో ఉన్నారు. పాలన అక్కడి నుంచే జరిగింది కదా. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన కొనసాగించే అధికారం ప్రజలిచ్చారు. ముఖ్యమంత్రి, ఆయనకు సహాయకులుగా మంత్రులు, కార్యదర్శులు ఉంటే ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు. ఇది వాస్తవం. ఓ తీర్మానం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు. శాసనసభను కూడా ఎక్కడి నుంచైనా నిర్వహించే వీలుంది. ఇంత వెసులుబాటు ఉన్నా.. ఎందుకు రాజకీయ పార్టీలు నాటకాలు, డ్రామాలు ఆడుతున్నాయో అర్ధం కావటం లేదు’’ అని సీఎం వ్యాఖ్యానించారు.

కొనసాగించాలా? వద్దా? అన్నది ఆలోచించాలి!

దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్లు ఉన్నాయని, పాలనాపరమైన సూచనలు ఇచ్చే మేధావులు ఉండేలా శాసనమండళ్లు ఏర్పాటయ్యాయని జగన్‌ గుర్తు చేశారు. మండలిలో ఆంగ్ల మాధ్యమం బిల్లును కూడా అడ్డుకున్నారని, అలా అడ్డుకున్న వ్యక్తులెవరూ తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించడం లేదన్నారు. పేదలు, సామాన్యులకు ఉపయోగపడే బిల్లులను అడ్డుకోవడం వల్ల వారికి ఏమొస్తుందని అసహనం వ్యక్తం చేశారు. పెద్దలు, మేధావులు ప్రభుత్వానికి సలహాలివ్వకుండా..ఇలాంటి రాజకీయాలు చేయటం సరికాదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభలో ఆంగ్ల మాధ్యమానికి అనుకూలమని చెప్పిన తెదేపా.. సదరు బిల్లును మండలిలో అడ్డుకుందని సీఎం గుర్తు చేశారు. ఏడాదికి రూ.60 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్న ఇలాంటి సభలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై పునరాలోచన చేయాలన్నారు. సోమవారం మళ్లీ సభను నిర్వహించాలని సభాపతి తమ్మినేని సీతారామ్‌ను కోరారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

నిర్ణయంపై ఉత్కంఠ..!

మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్‌ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మండలిని దుర్వియోగం చేస్తున్నారంటూ సీఎం విమర్శలు చేశారు. గత సమావేశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను అడ్డుకున్నారని ఆక్షేపించారు. బుధవారం జరిగిన పరిణామాలపై ఆయన ఒకింత అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మండలిలో వ్యవహరించారని..ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇలాంటి సభలను కొనసాగించాల్సిన అవసరముందా?లేదా? అనే అంశంపై ఆలోచించాలని వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో మండలిని రద్దు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుందా? లేదా? అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సభను సోమవారానికి వాయిదా వేసినందున ఆరోజు మండలిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts