Updated : 23 Jan 2020 20:35 IST

ప్రజాభిప్రాయం కోసమే సెలెక్ట్‌ కమిటీకి:యనమల

మంగళగిరి: సీఎం జగన్‌కు సలహాలు ఇవ్వడానికి ఎవరికీ ధైర్యం లేదని మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి జరుగుతుంటే మామూలుగా ఇద్దరు మంత్రులు కూడా రారని.. అలాంటిది మండలికి 22 మంది మంత్రులు రావాల్సిన అవసరం ఏముందని యనమల ప్రశ్నించారు. ఓటింగ్‌ జరుగుతుంటే అంతమంది మంత్రులు మండలికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని మంత్రి నిలదీశారు. ఈ నేపథ్యంలో బిల్లుకు సంబంధించిన మంత్రులు మాత్రం ఉండాలని రూల్‌ 90 కింద మండలి ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఏదో విధంగా బిల్లును ఆమోదించుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల అభిప్రాయం తీసుకోవడానికే బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తారని.. అక్కడ దాదాపు మూడు నెలల సమయం పడుతుందని యనమల వివరించారు. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశం శివరామకృష్ణ కమిటీ పరిశీలనలోనూ ఉందన్నారు. ఇప్పటివరకు రాజధానిని ఎవరైనా మార్చారా? ఒక తుగ్లక్‌ తప్ప.. అని దుయ్యబట్టారు. చివరకు తుగ్లక్ చేసిన మంచి పనులు కూడా జగన్‌ చేయట్లేదని యనమల ఎద్దేవా చేశారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కమిటీలకు చట్టబద్ధత ఏంటని ప్రశ్నించారు. కమిటీలు నివేదిక ఇవ్వకముందే రాజధానిపై ముందే ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు. నిన్న ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని.. సస్పెండ్ చేస్తే తప్ప ప్రతిపక్ష నేతలను బయటకు పంపించే హక్కు ఎవరికీ ఉండదని యనమల వివరించారు. మండలిలో తెదేపా సభ్యులెవరూ నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల డబ్బుతో ప్రజలపైనే యుద్ధం..
భారీ మెజారిటీతో 151 సీట్లు గెలిపించిన ప్రజలపైన జగన్‌కు ఎందుకంత కక్ష అని యనమల నిలదీశారు. ప్రజల డబ్బుతో న్యాయవాదిని పెట్టుకొని ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజానాలో డబ్బులేదని చెబుతూ న్యాయవాదికి రూ.5 కోట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని.. అందుకే ఇవాళ రైతులు, మహిళలు, పిల్లలు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అసెంబ్లీ ఎందుకు? మంత్రులు ఎందుకు?అని ప్రశ్నించారు. పాలనా అనుభవం లేకుండా తమ వద్ద అందరూ పెద్దలున్నారని భ్రమలో ఉన్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్నికల వస్తే వైకాపాకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

మండలి ఛైర్మన్‌ ఏం తప్పు చేశారు..
మండలి ఛైర్మన్‌ ఏం తప్పు చేశారని ఆయనపై దాడికి యత్నించారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాలోకేశ్‌ పైనా దాడికి యత్నించారన్నారు. వైకాపా నేతలు గొప్పవాళ్లయితే దుర్భాషలాడతారా? దాడి చేస్తారా? అని నిలదీశారు. ‘క్విడ్‌ప్రోకో డబ్బులతో జగన్‌ కడప, బెంగళూరులో ప్యాలెస్‌లు నిర్మించలేదా? సీబీఐ దర్యాప్తులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు తేలింది. 11 ఛార్జ్‌షీట్లతో 16 నెలలు జగన్‌ జైల్లో ఉన్నారు’ అని యనమల రామకృష్ణుడు అన్నారు.

ఎలాగైనా రాజధానిని విశాఖకు తరలించాలని..
‘మండలి ఛైర్మన్‌ తనకున్న విచక్షణాధికారంతో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన విచక్షణాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. సీఎం జగన్‌కు రూల్స్ తెలియదు. వైకాపా నేతలపై ఎన్ని కేసులున్నాయో అందరికీ తెలుసు. అలాంటి వారు కబుర్లు చెబుతున్నారు. 22 మంది మంత్రులు, వైకాపా నేతలు మండలిలో తిష్టవేసి.. మండలి కార్యకలాపాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు.  శాసన మండలి, శాసనసభ వేర్వేరు వ్యవస్థలు కావు. వాటి అధికారాలు, బాధ్యతలు మాత్రమే వేర్వేరుగా ఉంటాయి. మండలి ముందుకు వచ్చిన బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపవచ్చు. ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం మండలికి ఉంటుంది. సెలక్ట్ కమిటీ అంటేనే ప్రజల అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఏర్పాటైన వ్యవస్థ. ఆ కమిటీకి ఛైర్మన్‌గా వైకాపా మంత్రే ఉంటారు కదా?అలాంటప్పుడు వారికి భయమెందుకు? ఏదో రకంగా బిల్లు పాస్ చేసుకొని రాజధానిని విశాఖకు తరలించాలనే ఉద్దేశంతో అమరావతిపై ద్వేషం పెంచుకున్నారు’ అని వైకాపా తీరుపై యనమల మండిపడ్డారు.

జగన్‌గు చంద్రబాబే గుర్తొస్తున్నారు..
‘అమరావతిని చూస్తే జగన్‌గు చంద్రబాబే గుర్తొస్తున్నారు. అమరావతిని నాశనం చేయాలని చూస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని పక్కన పెట్టుకొని మంత్రులను డమ్మీ చేసి జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కూడా రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబును కూడా కోర్టుకు పంపించాలనుకుంటే కుదరదు. అభివృద్ధి విషయంలో పోటీ పడండి.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మండలిని రద్దు చేయాలని జగన్‌ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి.. రాజధానుల మార్పుపై ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామనే కారణంతోనే మండలిని రద్దు చేయాలనుకుంటున్నారా?ఈ విషయంలో జగన్ సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో మీడియాపై ఆంక్షలెందుకు?’ అని యనమల ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని