మండలి రద్దుపై పునరాలోచించాలి: పీడీఎఫ్‌

శాసన మండలి రద్దు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడాన్ని పీడీఎఫ్‌ తప్పుబట్టింది. శాసన మండలి నిర్వహణతో ఏడాదికి రూ .60కోట్లు వృథా అవుతున్నాయంటూ సీఎం జగన్‌, మంత్రులు శాసనసభలో...

Updated : 24 Jan 2020 21:08 IST

గుంటూరు: శాసన మండలి రద్దు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడాన్ని పీడీఎఫ్‌ తప్పుబట్టింది. శాసన మండలి నిర్వహణతో ఏడాదికి రూ .60కోట్లు వృథా అవుతున్నాయంటూ సీఎం జగన్‌, మంత్రులు శాసనసభలో మాట్లాడటం సరికాదని పీడీఎఫ్‌ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ మాత్రం మేథావులు అసెంబ్లీలోనూ ఉన్నారంటూ కించపరచడాన్ని వారు తప్పుబట్టారు. శాసన మండలిలో చర్చలు అర్థవంతంగా సాగుతాయని మంత్రులే చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. మండలిలో రాజకీయ నేతలే కాకుండా లక్షలాది మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులచే ప్రత్యక్షంగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని వివరించారు. వారెవరూ ఎన్నికల్లో డబ్బు కుమ్మరించరని.. కోటీశ్వర్లూ కాదన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలతో పాటు పొరుగుసేవల సిబ్బంది, నిరుద్యోగుల హక్కులపై తాము మండలిలో పోరాడుతున్నామని.. అనేక సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలోనూ మండలి రద్దు అంశాన్ని చేర్చలేదన్నారు. కేవలం తాము కోరుకుంటున్నట్లుగా నడుచుకోలేదని, తమ బిల్లులు ఆమోదం పొందలేదనే కారణంతో మండలిని రద్దు  చేస్తారా? అని ప్రశ్నించారు. శాసన మండలిని ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా గుర్తించడం ప్రభుత్వ బాధ్యతని బాలసుబ్రమణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. మండలి రద్దు విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని