ఇంత హవాను ఎప్పుడూ చూడలేదు: కేసీఆర్‌

తన అనుభవంలో అనేక మున్సిపల్‌ ఎన్నికలు చూశానని, ఈ స్థాయిలో తెరాసకు విజయం దక్కడం ఓ రికార్డు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరంగా ఎన్నికలను గెలుస్తూ వస్తోందని, ఇలాంటి హవాను ఎన్నడూ చూడలేదని...

Updated : 08 Dec 2022 14:54 IST

పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి
మార్చి 31 నుంచి 57 ఏళ్లు దాటిన వారికి పింఛను
సోషల్‌మీడియాపై చర్యలు తీసుకుంటాం

హైదరాబాద్‌: తన అనుభవంలో అనేక మున్సిపల్‌ ఎన్నికలు చూశానని, ఈ స్థాయిలో తెరాసకు విజయం దక్కడం ఓ రికార్డు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరంగా ఎన్నికలను గెలుస్తూ వస్తోందని, ఇలాంటి హవాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. పుర ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ పార్టీలకు చెంప ఛెల్లుమనిపించేలా ప్రజలు తీర్పు ఇచ్చారని కేసీఆర్‌ అన్నారు. పురపాలక, నగరపాలక సంస్థల్లో తెరాస ఆధిపత్యం సాధించిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలతో పాటు త్వరలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు.  

సోషల్‌మీడియాలో దూషణలు సరికాదు
‘‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే రకమైన తీర్పు ఇచ్చారు. తెరాస అమలు చేస్తున్న పథకాల వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. విజయం కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నా అభినందనలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘన విజయం సాధించడం చాలా అరుదు. గతేడాది 32 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నాం. ఎన్నికలు ఆపేందుకు విపక్షాలు చాలా ప్రయత్నాలు చేశాయి. అన్ని రకాల ప్రజలు ఉండే పట్టణాల్లో ఇలాంటి ఫలితాలు రావడం చాలా అరుదు. చెంప ఛెల్లుమని అనిపించినట్లుగా జాతీయ పార్టీలకు ఫలితాలు ఉన్నాయి. జాతీయ పార్టీలు వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటు. సోషల్‌ మీడియా దూషణలు సరికాదు. అది యాంటీ సోషల్‌మీడియా. ఇకపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు ఉంటాయి.

మా ఖర్చు రూ.80 లక్షలే
నేను, మంత్రి కేటీఆర్‌ ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఈ ఎన్నికల్లో అసలు నేను ఏ అధికారితోనూ మాట్లాడలేదు. అధికార దుర్వినియోగం చేశామంటూ విపక్షాలు చౌకబారు మాటలతో ప్రజల తీర్పును అగౌరవ పరచవద్దు. విపక్షాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు గెలిచాయి. మరి ఎలా గెలిచారు? విపక్షాల్లో ప్రజలు ఇప్పటికే చాలా ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అయినా వారి తీరు మారలేదు. ఈ ఎన్నికల్లో కేవలం రూ.80 లక్షలు మాత్రమే పార్టీ తరఫున ఖర్చు చేశాం. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. 

పట్టణ ప్రగతి చేపడతాం..
పల్లె ప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ ఎన్నికల్లో ఎన్నికైన వారికి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. పట్టణాల అభివృద్ధి, నగరీకరణలో సవాళ్లపై అవగాహన కల్పిస్తాం. బీజింగ్‌ తర్వాత దిల్లీ అత్యధిక కాలుష్యం ఎదుర్కొంటోంది. హైదరాబాద్‌కు వస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.

57 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛను
మార్చి 31 నుంచి 57 ఏళ్లు దాటిన వారందరికీ వృద్ధాప్య పింఛను అందజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి కూడా పెంచుతాం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉంది. పీఆర్సీ పెంపుపై కూడా త్వరలో చర్చలు జరుపుతాం. పరిమితుల బట్టి పీఆర్సీ అమలు చేస్తాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా దిగజారుతోందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ జీఎస్‌డీపీ మాత్రం పెరుగుతోంది. కంటి వెలుగు తరహాలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య సూచికను తెలిపే కార్యక్రమాన్ని త్వరలో చేపడతాం.

గల్ఫ్‌ విధానం
తెలంగాణ ప్రజలు ఇక్కడి నుంచి గల్ఫ్‌ వెళుతున్నారు. రాష్ట్రంలో చాలా మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. అప్పులు చేసి మరీ దుబాయ్‌ ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోనే ఉపాధి లభిస్తుంటే గల్ఫ్‌కు ఎందుకు వెళుతున్నారు? అసెంబ్లీ సెషన్‌కు ముందు గల్ఫ్‌ పర్యటన చేసి సమస్యను పరిష్కరిస్తాం. త్వరలో గల్ఫ్‌ పాలసీ తీసుకొస్తాం. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత నిర్మూలనకు కృషి చేస్తాం. రెవెన్యూ కార్యాలయానికి ప్రజలు పెట్రోల్‌ పట్టుకుని వచ్చే పరిస్థితి ఎందుకు వస్తుందో ఆ శాఖ అధికారులు ఆలోచించుకోవాలి. పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తీసుకొస్తాం. 

పన్నులు పెంచుతాం
పల్లెలతో పాటు పట్టణాల అభివృద్ధికి నిధులు అందిస్తాం. మున్సిపల్‌, గ్రామ పంచాయతీల్లో పన్నులు కొద్దిగా పెంచాలి. నిరుపేదలపై కాకుండా చెల్లింపు సామర్థ్యం ఉన్నవారిపై పన్ను భారం తప్పదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా నిర్ణయం తీసుకుంటాం. రైతు సమన్వయ సమితులను క్రియాశీలం చేస్తాం. రైతులే నిర్ణయాధికారులగా మారే ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తాం. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక ఏర్పాటు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నిరుద్యోగ భృతిని అందించేందుకు పరిశీలిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఇదీ చదవండీ..

సీఏఏపై అసెంబ్లీలో త్వరలో తీర్మానం: కేసీఆర్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని