సీఏఏపై అసెంబ్లీలో త్వరలో తీర్మానం: కేసీఆర్‌

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తెరాస వ్యతిరేకిస్తోందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే పార్లమెంట్‌లో ఈ బిల్లును వ్యతిరేకించామని చెప్పారు. ఒక లౌకిక వాద పార్టీగా వందకు వంద శాతం...

Updated : 08 Dec 2022 12:56 IST

హైదరాబాద్‌: కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తెరాస వ్యతిరేకిస్తోందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే పార్లమెంట్‌లో ఈ బిల్లును వ్యతిరేకించామని చెప్పారు. ఒక లౌకిక వాద పార్టీగా వందకు వంద శాతం తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. త్వరలో దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన సీఏఏపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 విషయంలో కేంద్రానికి మద్దతు తెలిపాం. సీఏఏని పార్లమెంట్లో వ్యతిరేకించాం. దీనిపై ఇప్పటికే ఇతర సీఎంలతో మాట్లాడా. సీఏఏపై త్వరలో ప్రాంతీయ పార్టీల కాన్‌క్లేవ్‌ నిర్వహిస్తాం. సీఏఏకు వ్యతిరేకంగా పది లక్షల మందితో బహిరంగ సభ పెడతాం. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే సీఏఏని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాయి. త్వరలో మేం కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. సీఏఏ చట్టంతో దేశ ప్రతిష్ఠ అప్రతిష్ఠ పాలైంది. ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే ఇలాంటి వన్నీ ఎందుకు? క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ గురించి పట్టించుకోకుండా ఇలాంటి ఉద్రేకాలను రెచ్చగొట్టడం ఎందుకు? హిందూ, ముస్లింలు కలిసి ఎంచక్కా ఉన్నారుగా. మన దేశం వాళ్లు గల్ఫ్‌లో ఉంటున్నారు. వాళ్లను ఆయా దేశాలు వెళ్లిపోమంటే మన పరిస్థితి ఏంటి? ఎన్‌ఆర్‌సీకి ఇది తొలి మెట్టు అని హోంశాఖ తన నివేదికలోనే ఉంది. తెరాస సెక్యులర్‌ పార్టీగానే ఉంటుంది. మతతత్వ పార్టీ వైఖరి వల్లే భైంసాలో అల్లర్లు జరిగాయి. భైంసాలో జరిగిన ఘటనను నేను కూడా సహించలేదు. భైంసాకు బలగాలను పంపి పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. పోలీసులు తీసుకున్న చర్యల వల్ల భైంసాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇలాంటి విధానాల వల్లే రాష్ట్రాల్లో ఓడిపోతున్నారు. రేప్పొద్దున దిల్లీలో కేజ్రీవాల్‌ గెలుస్తారని అందరూ చెబుతున్నారు’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఇదీ చదవండీ..

ఇంత హవాను ఎప్పుడూ చూడలేదు: కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని