పటిష్ట వ్యూహంతో కారు జోరు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఘనవిజయం సాధించింది. మొత్తం 120 పురపాలక సంఘాలకు గాను 107లో అధికారం అందుకొంది.

Published : 26 Jan 2020 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఘనవిజయం సాధించింది. మొత్తం 120 పురపాలక సంఘాలకు గాను 107లో అధికారం అందుకొంది. మరో నాలుగు పురపాలక సంఘాల్లోనూ రెబల్స్‌, ఎక్స్‌ అఫీషియో సభ్యుల మద్ధతుతో అధికారం కైవశం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అలాగే  తొమ్మిది నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఏడింటిలో పరిపూర్ణ విజయం సాధించింది. నిజామాబాద్‌లో మొత్తం 60 స్థానాలుండగా భాజపాకు 27, తెరాసకు 14, మజ్లిస్‌కు 16, కాంగ్రెస్‌ 2, ఇతరులకు1 స్థానం దక్కడంతో హంగ్‌ ఏర్పడింది. 

తెరాస పటిష్ట వ్యూహంతో..

పుర ఎన్నికలకు ముందుగానే తెరాస పటిష్టవ్యూహాన్ని రచించి కార్యరంగంలోకి దిగింది. అగ్రనేత కేసీఆర్‌ సూచనలతో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మంత్రులు, స్థానిక నేతలు సమన్వయంతో కదిలారు. టికెట్ల అంశంపై  పలు ప్రాంతాల్లో అసమ్మతి తలెత్తినా ఏర్పడినా సమస్యను పరిష్కరించడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు ఒక్కటిగా ప్రచారం నిర్వహించారు. గెలుస్తామనే నమ్మకంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టికెట్లు దక్కని వారిని పార్టీ పదవుల్లో, ప్రభుత్వ నామినేటడ్‌ పదవుల్లో నియమిస్తామని హామీ ఇవ్వడంతో అసంతృప్త నేతలు సద్దుమణిగారు.  స్థానిక  పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ ఎన్నికల ప్రణాళికలను రూపొందించారు. గడప గడపకీ ప్రచారం చేయడం కూడా కలిసివచ్చింది. తమ తమ జిల్లాల్లో మంత్రులే పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు చేపట్టాలని తెరాస అగ్రనాయకత్వం సూచించింది.  పుర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రలు తమ జిల్లాల పరిధిలో చివరివరకు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఓటూ కీలకమని వీలైనంత ఎక్కువమంది ఓటింగ్‌ చేసేందుకు వీలుగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేటీఆర్‌ కోరారు. గత ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. పురపోరులో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పథకాల సమర్థ నిర్వహణ ఓటర్లపై ప్రభావం చూపాయి. తెరాసతోనే అభివృద్ధి అన్న తెరాస నినాదాన్ని వారు విశ్వసించారు. అందుకు అనుగుణంగా ఓటువేసి గెలిపించారు.

కాంగ్రెస్‌కు నిరాశ..

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ ఈ ‘పుర’పోరులో ఎక్కువ సీట్లు సాధించాలని ఆశించినా ఫలితాలు వారికి నిరాశ మిగిల్చాయి. ఏడు పురపాలకసంఘాల్లో మాత్రమే గెలుపు పొందగా ఒక్క కార్పోరేషన్‌ కూడా దక్కకపోవడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు సీట్లను గెలుపొందిన కాంగ్రెస్‌ స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.  పార్టీలో వర్గపోరు, టికెట్ల పంపకాల్లో పెరిగిన అసమ్మతితో పాటు పలు అంశాలు పార్టీ పరాజయానికి దారి తీశాయి.

వికసించని కమలం..

ఈ ఎన్నికల్లో భారీ గెలుపు సాధించి రాష్ట్రంలో విస్తరించాలనుకున్న భాజపా ఆశలను ఈ ఎన్నికలు నిర్ఘాంతపరిచాయి. తుక్కుగూడ, ఆమన్‌గల్‌ పురపాలక సంఘాలను మాత్రమే గెలుచుకున్న భాజపా నిజమాబాద్‌ నగరపాలక సంఘంలో మాత్రం అత్యధిక స్థానాలు సాధించిన పక్షంగా నిలబడినా మెజార్టీ సాధించలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని