వైకాపాలో చేరేందుకు సిద్ధంగా 17 మంది ఎమ్మెల్యేలు

తెదేపాకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం తమకు లేదని, పార్టీలో చేరేందుకు ఇప్పటికే కొందరు సిద్ధంగా ఉన్నారని, వీరందరినీ మేమేం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

Updated : 27 Jan 2020 07:05 IST

ఎమ్మెల్సీలూ ముందుకొస్తున్నారు
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపాకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం తమకు లేదని, పార్టీలో చేరేందుకు ఇప్పటికే కొందరు సిద్ధంగా ఉన్నారని, వీరందరినీ మేమేం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శాసన మండలి రద్దుతో నష్టమే అయినా సీఎం జగన్‌ ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారని వెల్లడించారు. తెదేపా సభ్యుల వ్యవహార శైలి చూసే సీఎంకు మండలి రద్దు ఆలోచన వచ్చిందని తెలిపారు. మండలి రద్దుపై తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం అడ్డుకోబోదని పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల విలేకరులతో మాట్లాడారు. శాసన మండలి వల్ల అనవసర రాజకీయాలు, చికాకులు తప్ప లాభం లేదని వ్యాఖ్యానించారు. మండలి రద్దుకు చర్చలు జరుగుతున్నాయని, దీనిపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ‘మండలిలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే బిల్లులు సెలక్టు కమిటీకి వెళ్తాయి. దీంతో నిర్ణయం అమలుకు కొంత సమయం పడుతుంది. బిల్లుల స్థానంలో ఆర్డినెన్సు తెచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంది’ అని తెలిపారు. మా నిర్ణయం సరైందో కాదో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజలే తీర్పు చెబుతారని సజ్జల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని