Published : 27 Jan 2020 07:23 IST

జిల్లాలకు సీల్డు కవర్లు

మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తి
జాబితాను రూపొందించిన కేటీఆర్‌
సీఎం సూచనలకు అనుగుణంగా ఖరారు
అధిష్ఠానం ఫ్లాష్‌ సర్వే
నిజామాబాద్‌లో మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్‌ పదవి!
ఈనాడు - హైదరాబాద్‌

సోమవారం జరిగే మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నికలకు తెరాస  అభ్యర్థుల వివరాలను అధిష్ఠానం సీల్డ్‌ కవర్లలో ఉంచి ఆదివారం రాత్రి జిల్లాలకు పంపింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు   కేటీ రామారావు తీవ్ర కసరత్తు అనంతరం జాబితాను రూపొందించగా... దానిని సీఎం పరిశీలించి ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు సోమవారం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమతమ పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు చేరుకున్న తర్వాత ఈ పదవులకు ఎంపిక చేసిన వారి వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జులు వెల్లడిస్తారు. వెంటనే బి-ఫారాలను అందజేస్తారు. ఇప్పటికే అన్ని చోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్ల నుంచి పార్టీ విప్‌ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు.

పకడ్బందీ కసరత్తు
మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పదవులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కేటీఆర్‌ శనివారం ఫలితాల వెల్లడి తర్వాత నుంచే చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి, ఈ పదవులకు ఇద్దరేసి చొప్పున ప్రతిపాదనలు తీసుకున్నారు. ఆయా అభ్యర్థులపై ఆదివారం ఫ్లాష్‌ సర్వే చేయించారు. పార్టీ ఇన్‌ఛార్జుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం జాబితాను సిద్ధం చేశారు. ఇందులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నారు. కొన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్నీ ఒకే వర్గానికి వచ్చే అవకాశం ఉంటే మార్పులు చేసినట్లు తెలిసింది. జనరల్‌ స్థానాల్లో ఇతర వర్గాల వారిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చారు.

మజ్లిస్‌ సహకారం
నగరపాలిక, పురపాలిక పీఠాల కోసం మజ్లిస్‌ పార్టీ సహకారం తీసుకోవాలని తెరాస నిర్ణయించింది. ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏయే స్థానాల్లో మజ్లిస్‌ సహకారం అవసరమో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌లో గెలిచేందుకు మజ్లిస్‌ సహకారం అవసరమయినందున అక్కడ డిప్యూటీ మేయర్‌ పదవిని ఆ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ల ఎంపికపై కేటీఆర్‌ సమీక్ష

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ల ఎంపిక నేపథ్యంలో కేటీఆర్‌ ఆదివారం రోజంతా దీనిపై సమీక్షలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలతో విస్తృతంగా చర్చించారు. కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని, పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రతి చోటా గెలవాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్‌అఫిషియో సభ్యులు అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పారు. కొన్ని చోట్ల భాజపా, కాంగ్రెస్‌లు కలిసే వీలున్నందున వాటి ఎత్తుగడలను తిప్పికొట్టాలని సూచించినట్లు తెలిసింది. రాబోయే నాలుగు సంవత్సరాలపాటు తెరాస అధికారంలో ఉంటుందని, ఈనేపథ్యంలో వార్డులను అభివృద్ధి చేసే అవకాశం తెరాస ద్వారానే లభిస్తుందన్న విషయాన్ని స్వతంత్రులకు తెలియజెప్పాలని సూచించినట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని