
మండలి రద్దుపై తెదేపా భేటీ
మంగళగిరి: తెదేపా శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. శాసనమండలి రద్దు అంశంపై కేబినెట్ నిర్ణయం, శాసనసభలో జరిగే పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు.
మరోవైపు గవర్నర్, శాసనసభ స్పీకర్‌కు తెదేపా శాసనసభాపక్షం లేఖ రాసింది. సభ నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. తొలుత మూడు రోజులు అసెంబ్లీ నిర్వహిస్తామని బీఏసీలో నిర్ణయించారని, బీఏసీకి చెప్పకుండానే ఇష్టానుసారం సభను పొడించారని లేఖలో పేర్కొంది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లును అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని తెదేపా చెబుతోంది. అంతేకాకుండా కౌన్సిల్‌లో మాట్లాడిన అంశాలను శాసనసభలో ప్రస్తావించ కూడదని లేఖలో తెలిపింది. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే చర్చలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే సభను బహిష్కరించినట్లు టీడీఎల్పీ వెల్లడించింది.
ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో పార్టీ నేతలతో చంద్రబాబు దాదాపు 5 గంటల పాటు సమావేశమయ్యారు. ఇవాళ్టి శాసనసభ అజెండా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, శాసనమండలి నిర్ణయాలను శిక్షించేందుకు శాసనసభ సమావేశం కావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అందుకే సమావేశాలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.