
3 రాజధానులు..ప్రజల ఆకాంక్ష: ఆళ్ల నాని
మండలి రద్దుపై శాసనసభలో చర్చ
అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని దీనిపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని సీఎం జగన్ చెప్పారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆయనేనని ఆళ్ల విమర్శించారు. తన స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటు ఏపీ ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆళ్లనాని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్యాలరీలో కూర్చొని మండలిని చంద్రబాబు డిక్టేట్ చేశారని విమర్శించారు.
అనంతరం మరో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికల్లో 51 శాతం మంది ప్రజలు వైకాపాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజలు తిరస్కరించిన తెదేపా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. 67 దేశాల్లో మాత్రమే ఎగువ సభలు ఉన్నాయని, 101 దేశాల్లో పెద్దల సభలు లేవని ఆయన సభలో వెల్లడించారు. బ్రిటీషర్ల ప్రోత్సాహంతోనే ఈ సభలు ఏర్పాటయ్యాయని ఆయన సభకు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.