ఎయిర్‌ ఇండియా అమ్మకం తగదు: సిన్హా

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎయిర్‌ఇండియాలో వంద శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు.

Published : 28 Jan 2020 01:38 IST

లఖ్‌నవూ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎయిర్‌ఇండియాలో వంద శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. లఖ్‌నవూలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంతగా దారుణమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. కేంద్రం మరోసారి ఎయిర్‌ఇండియాలో వాటాలు విక్రయించడానికి ప్రయత్నిస్తోంది.. కానీ ఆర్థిక మందగమనం కారణంగా కొనేవారే కరవయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మోదీ ప్రభుత్వం చేపట్టిన మళ్లింపు చర్య. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌ చట్టాల ద్వారా కేంద్రం ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని దారి మళ్లిస్తోంది’ అని ఆరోపించారు. 

‘సీఏఏకు వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేసే వారిపై కేంద్రం నియంతలా వ్యవహరిస్తోంది. ఇలాంటి చట్టాల కారణంగా దేశంలో భయంతో నిండిన వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ రాజ్యాంగ విరుద్ధ భాషను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఏఏ అమలు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదంటున్నారు.. కానీ ఆ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం’ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం అఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు వచ్చిన అక్కడి మైనారిటీలకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తుందని.. భారత పౌరులకు దీని నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని కేంద్రం చెబుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని