‘కేసీఆర్‌ కుటుంబం జైలుకెళ్లే రోజు వస్తుంది’

మున్సిపల్ ఎన్నికల ప్రకటనకు ముందే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ బ్లాక్‌ మెయిల్‌ చేశారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దోచుకున్న...

Published : 28 Jan 2020 15:31 IST

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌: మున్సిపల్ ఎన్నికల ప్రకటనకు ముందే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ బ్లాక్‌ మెయిల్‌ చేశారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. ఈ మున్సిపల్ ఎన్నికలు నిజాయతీ జరగలేదని విమర్శించారు. 

ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

‘‘ఎక్స్‌ అఫీషియో ఓట్లతో యాదగిరి గుట్టను కైవసం చేసుకున్నారు. ఆదిభట్లలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చినా మా కౌన్సిలర్‌లను తీసుకెళ్లి తెరాస ఛైర్మన్‌గా చేశారు. పెద్ద అంబర్‌పేట, చౌటుప్పల్‌లో మా కౌన్సిలర్లను ఎత్తుకెళ్లిపోయారు. చౌటుప్పల్‌లో సీపీఎం వాళ్లను కొనేశారు. గత 25 ఏళ్లలో ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. రజాకార్ల కంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారు. సిరిసిల్లలో తెరాస రెబెల్స్‌ పోటీ చేస్తే వారిని సస్పెండ్‌ చేస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌.. ఇప్పుడు వారిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. కేటీఆర్‌ది నోరా.. తాటిమట్టా?గజ్వేల్‌లో 74 ఏళ్ల నారాయణ రెడ్డిని ఛైర్మన్‌ చేస్తామని మోసం చేశారు. నేరేడుచర్లలో 25న తయారైన ఓటర్ల జాబితాలో ఈరోజు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని చేర్చారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు.

మిమ్మల్ని కోమటిరెడ్డి వదిలిపెట్టడు

‘‘కేసీఆర్‌, కేటీఆర్‌ సిగ్గు లేకుండా పనిచేస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టం.. గ్రామ గ్రామాన తిరిగి వారి తీరున ఎండగడతాం. నల్గొండలో తెరాస-భాజపా, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయి. కేసీఆర్‌ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుంది. వాళ్లు చేసిన అవినీతిపై ఆధారాలను ఈడీ, విజిలెన్స్‌కు అందిస్తా. మిమ్మల్ని కోమటిరెడ్డి వదిలిపెట్టడు. మీ దోపిడీని పార్లమెంట్‌లో ఎండగడతా. నా నియోజకవర్గం పరిధిలో 9 మున్సిపాలిటీల్లో క్లియర్‌ మెజార్టీ వచ్చింది.. కానీ మాకు రెండే దక్కాయి. నాకు పీసీసీ పదవిస్తే తీసుకుంటా.. లేకుంటే కార్యకర్తగా పనిచేస్తా’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని