
జనసేన పార్టీకి షాక్!
హైదరాబాద్: జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పంపారు. పవన్‌లో నిలకడైన విధివిధానాలు లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లక్ష్మీనారాయణ పవన్‌కు రాసిన రాజీనామా లేఖ యథాతథంగా.. ‘‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని.. సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది. కావున నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను’’
‘‘ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంటన నడిచిన ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రతి ఓటరుకి నా కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ వారందరికీ.. మీకు, మీ కుటుంబసభ్యులకు ఎప్పుడూ మంచి జరగాలని..భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు..’’ అని లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.