జగన్‌ రోజుకో పరిశ్రమను వెళ్లగొడుతున్నారు

పదేపదే సీమ జపం చేసే సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఆ ప్రాంతంలోని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం

Updated : 08 Feb 2020 17:46 IST

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం

మంగళగిరి: పదేపదే సీమ జపం చేసే సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఆ ప్రాంతంలోని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎంతో శ్రమించి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి మొబైల్‌ తయారీలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. అలాంటిది ఈరోజు సీఎం జగన్‌ రాష్ట్రం నుంచి రోజుకో పరిశ్రమను వెళ్లగొడుతున్నారని విమర్శించారు. మొన్న కియా, నిన్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, నేడు రిలయన్స్‌.. ఇలా ఒక్కో పరిశ్రమ రాష్ట్రం వీడి వెళ్లిపోతున్నాయన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన కృషిని జాతీయ పత్రికలు సైతం కీర్తించాయని పట్టాభిరాం గుర్తు చేశారు. ఏపీలో చంద్రబాబు నెలకొల్పిన రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను చూసి ముఖేష్ అంబానీ సైతం ఆశ్చర్యపోయారని చెప్పారు. చిత్తూరు జిల్లా నుంచి రిలయన్స్ సంస్థను పంపేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలు ఏం లేనట్లయితే రిలయన్స్ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కు ఇవ్వాల్సిందిగా సంబంధిత తహసీల్దార్‌ చేత నోటీసులు ఎందుకు జారీ చేయించారని పట్టాభిరాం ప్రశ్నించారు. తెదేపా హయాంలో ఏపీఐఐసీ ద్వారా రిలయన్స్ సంస్థకు 136 ఎకరాలు కేటాయించారని.. వాటిలో 60 ఎకరాలు తిరిగివ్వాలని వైకాపా ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని