షీలా హయాంలోనే పతనం మొదలు: చాకో

దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు పీసీ చాకో దిల్లీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి పదవికి....

Published : 13 Feb 2020 01:02 IST

దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు పీసీ చాకో దిల్లీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి కాంగ్రెస్‌ నాయకురాలు, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కారణమంటూ ఆరోపించారు. ‘‘2013లో షీలా దీక్షిత్ దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ పతనం ప్రారంభమయింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని అప్పుడే కొత్తగా అవతరించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తన వైపునకు తిప్పుకొంది. ఇక ఎప్పటికీ మేం పుంజుకోలేం. ఆ ఓటర్లంతా ఆప్‌తోనే ఉంటారు’’ అని చాకో అన్నారు.

చాకో వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముంబయి కాంగ్రెస్‌ చీఫ్ మిలింద్ దేవ్‌రా స్పందిస్తూ ‘‘చనిపోయిన తర్వాత షీలా దీక్షిత్‌ వంటి నేతపై ఇటువంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ఆమె హయాంలోనే దిల్లీ ఎంతో అభివృద్ధి సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ గతంలో కంటే బలంగా ఉంది. ఆమె విలక్షణమైన నాయకురాలు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు 63 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. నాయకత్వ లోపం, బలహీనమైన ఎన్నికల ప్రణాళిక, బలమైన అభ్యర్థులు లేకపోవడం వంటి కారణాలతో 70 స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని