‘మహా’ ప్రభుత్వంలో విభేదాలు?

మహారాష్ట్రలోని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా పూర్తవకముందే కూటమి మధ్య అభిప్రాయభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. భీమా కోరెగావ్‌ కేసు, ఎన్‌పీఆర్‌ విషయంలో ఠాక్రే

Published : 17 Feb 2020 10:42 IST

ఠాక్రే తీరుపై పవార్‌ అసంతృప్తి

నేడు ఎన్సీపీ మంత్రులతో భేటీ

ముంబయి: మహారాష్ట్రలోని ‘మహా వికాస్‌ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా పూర్తికాకుండానే కూటమి మధ్య అభిప్రాయభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. భీమా కోరెగావ్‌ కేసు, ఎన్‌పీఆర్‌ విషయంలో ఠాక్రే వ్యవహరించిన తీరుపై మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు పార్టీ మంత్రులతో పవార్‌ సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

భీమా కోరెగావ్‌ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తునకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గతవారం కేంద్రానికి స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్న పుణె న్యాయస్థానం.. కేసును ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేసింది. అయితే ఉద్ధవ్‌ నిర్ణయాన్ని మహారాష్ట్ర  సంకీర్ణ ప్రభుత్వం భాగస్వామి అయిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం ద్వారా ఉద్ధవ్‌ పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. దీంతో కూటమి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత మహారాష్ట్రలో జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) ప్రక్రియ చేపట్టేందుకు ఉద్ధవ్‌ ఆసక్తి చూపించడం కూడా కూటమిపై ప్రభావం చూపించింది. ఈ విషయంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ వ్యతిరేకించినప్పటికీ మే 1 నుంచి ఎన్‌పీఆర్‌ అమలు చేయాలని ఠాక్రే భావించడంతో విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్సీపీ తమ తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ నేడు ఎన్సీపీ మంత్రులతో సమావేశం కానున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని