నవీన్‌ జీ.. సీఏఏపై మీ వైఖరేంటి?

ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టంపై ఒడిశా ప్రభుత్వం, బిజూ జనతాదళ్‌ వైఖరేంటో చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.......

Published : 18 Feb 2020 01:31 IST

అసెంబ్లీలో కాంగ్రెస్‌ నేత ప్రశ్న

భువనేశ్వర్‌: పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఒడిశా ప్రభుత్వం, బిజూ జనతాదళ్‌ వైఖరేంటో చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఫిబ్రవరి 28 నుంచి రెండు రోజుల పాటు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా ఒడిశాలో పర్యటించి సీఏఏకు అనుకూలంగా బహిరంగ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని శాసనసభలో కాంగ్రెస్‌ ప్రస్తావించింది. జీరో అవర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ సలుజా మాట్లాడుతూ.. బిజూ జనతా దళ్‌ (బీజేడీ) ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో సీఏఏకు మద్దతు తెలిపారని చెప్పారు. కానీ, మైనార్టీ వర్గాల ప్రతినిధులతో డిసెంబర్‌లో భువనేశ్వర్‌లో సమావేశం సందర్భంగా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తమ రాష్ట్రం ఎన్‌ఆర్‌సీకి మద్దతు తెలపబోదన్నారని గుర్తు చేశారు.ఈ వైఖరిలో మార్పు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందన్నారు. తమకు ఓటు వేసి వరుసగా ఐదుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల పక్షాన నిలబడి సీఏఏపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచించాలన్నారు. ఒడిశాలో ప్రజలంతా శాంతియుతంగా, సోదరభావంతో మెలుగుతున్నారని చెప్పారు.

అమిత్‌ షా తలపెట్టిన సీఏఏకు మద్దతు ర్యాలీలో బీజేడీ నేతలు పాల్గొంటారా? దూరంగా ఉంటారో చెప్పాలన్నారు. జగన్నాథుడి భూమిలో నివసిస్తున్న తమకు అన్ని వర్గాలూ సమానమేనన్నారు. దిల్లీలాంటి వాతావరణం తమకు భువనేశ్వర్‌, ఒడిశాలో కావాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మత సామరస్యతకు ఆటంకం కలగనీయబోమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని