కంచర్ల Vs కోమటిరెడ్డి..!

పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో తెరాస, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నల్గొండలో జరిగింది. స్థానిక వ్యవసాయ...

Published : 20 Feb 2020 01:25 IST

పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో ఎమ్మెల్యేల వాగ్వాదం

నల్గొండ: పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో తెరాస, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నల్గొండలో జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాసకు చెందిన స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధే లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. అక్కడే ఉన్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌.. కంచర్ల భూపాల్‌రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. 

తమ ప్రభుత్వ హయాంలోనే పథకాలు అమలయ్యాయని.. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎక్కడా సరిగా అమలు కావడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను కంచర్ల విమర్శించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు తమ నేతలను సమర్థిస్తూ ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలిద్దరూ ఒకరిపైకి మరొకరు దూసుకెళ్తారన్న దశలో పోలీసులు ఇరువురుని అడ్డుకుని శాంతింపజేశారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ వేదికపై గొడవలకు దిగడం.. మీడియా ఎదుట హడావుడి చేయడం తమ జిల్లా నేతలకు మామూలేనంటూ చురకలంటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని