Updated : 20 Feb 2020 21:28 IST

ఆస్తుల వివరాలను వెల్లడించిన నారా లోకేశ్‌

అమరావతి: రాజకీయాలపై ఆధారపడకూడదని హెరిటేజ్‌ సంస్థను స్థాపించామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు. 15 రాష్ట్రాల్లో హెరిటేజ్‌ పాల ఉత్పత్తులను విక్రయిస్తుమన్నారు. తమ సంస్థ ద్వారా 3వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని..9 రాష్ట్రాల్లో హెరిటేజ్‌కు ఆస్తులు ఉన్నాయని ఆయన వివరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను లోకేశ్‌ వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో హెరిటేజ్‌కు ఆస్తులు లేవని స్పష్టం చేశారు. హెరిటేజ్‌ కోసం రాజధాని పరిధికి 30కి.మీ దూరంలో 2014 మార్చిలో భూములు కొన్నారని చెప్పారు.

‘‘చంద్రబాబు ఆస్తి రూ.9 కోట్లు.. అప్పులు రూ.5.13కోట్లు. ఆయన నికర ఆస్తి రూ.3.87 కోట్లు. గతేడాదితో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు రూ.87లక్షలు పెరిగాయి. భువనేశ్వరి ఆస్తులు రూ.50కోట్లు. గతం కంటే ఆమె ఆస్తులు తగ్గాయి. నా ఆస్తులు రూ.8.14 కోట్లు. నా పేరిట ఉన్న షేర్లను బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చా. గతం కంటే నా ఆస్తి రూ.2.40కోట్లు తగ్గింది’’ అని లోకేశ్‌ వివరించారు. తమ కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయడం సరికాదని.. ఆరోపణలు చేసేముందు వారు తమ ఆస్తులను ప్రకటించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటించడం కాదని.. మీరే ప్రకటించాలంటూ పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆస్తులు ప్రకటించాలని తాము డిమాండ్‌ చేస్తే వారి నుంచి సమాధానం రావడం లేదన్నారు.

నిరూపించండి.. వారికే రాసిస్తాం!

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని.. నిరూపించమంటే ముందుకు రాలేకపోతున్నారని లోకేశ్‌ విమర్శించారు. తాము ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉందని నిరూపిస్తే దాన్ని గుర్తించిన వారికే ఇచ్చేస్తామని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. తమ ఆస్తులపై తొమ్మిదేళ్లుగా సవాల్‌ విసురుతున్నా ఎవరూ స్వీకరించడం లేదన్నారు. 2009లో రూ.లక్షల్లో ఉన్న సీఎం జగన్‌ ఆస్తులు ఇప్పుడు రూ.42వేల కోట్లకు చేరాయని లోకేశ్‌ చెప్పారు. దోచుకోకపోతే అంత డబ్బు ఎలా వచ్చిందని నిలదీశారు. అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని