కేసీఆర్‌ ఉద్యోగులను మోసం చేశారు: లక్ష్మణ్‌

ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు, రైతులు గుర్తొస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఎన్నికల తర్వాత మాటమార్చి ఉద్యోగులను సీఎం మోసం చేశారని విమర్శించారు.

Published : 20 Feb 2020 19:26 IST

హైదరాబాద్‌: ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు, రైతులు గుర్తొస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఎన్నికల తర్వాత మాటమార్చి ఉద్యోగులను సీఎం మోసం చేశారని విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించలేని స్థితి నెలకొందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని.. ఆరు సంవత్సరాల్లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వలేదని లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని చెప్పి దాన్ని అటకెక్కించారని ఆక్షేపించారు.  తెరాస ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు అప్పుచేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే మూడుసార్లు పీఆర్సీ గడువును పొడిగించారని.. తాజాగా మళ్లీ డిసెంబర్‌ 31వరకు దాన్ని పొడిగించారని లక్ష్మణ్‌ మండిపడ్డారు.

కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ పదవులు వస్తున్నాయని.. యువతకు ఉద్యోగాలు మాత్రం రావడం లేదన్నారు. 120 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ల స్వార్థం కోసం ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రులైనా ఉద్యోగులకు న్యాయం చేయడం లేదన్నారు. మార్చి 15న సీఏఏకు అనుకూలంగా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరవుతారని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని