‘రాజధానిలో నాకు సెంటు స్థలం కూడా లేదు’

వైకాపా ఎంపీల బెదిరింపులకు భయపడబోమని గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ స్పష్టంచేశారు. శనివారం ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మందడంలో రైతుల పోరాటానికి తన సంఘీభావాన్ని...

Updated : 22 Feb 2020 19:07 IST

వైకాపా బెదిరింపులకు భయపడబోమన్న ఎంపీ గల్లా

మందడం: వైకాపా ఎంపీల బెదిరింపులకు భయపడబోమని గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ స్పష్టంచేశారు. శనివారం ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించారు. శనివారం సాయంత్రం ఆయన మందడంలో రైతుల పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ.. మరో నాలుగేళ్లు ఉద్యమం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. స్థానిక ఎంపీగా రాజధాని రైతుల బాగోగులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కొందరు వ్యక్తులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారనీ..  రాజధానిలో తనకు ఒక సెంటు స్థలం కూడా లేదని అన్నారు. 

నిర్ణయం మార్చుకొనేదాకా పోరాటం ఆపం

మరోవైపు, రాజధాని గ్రామాల్లో మహిళా జేఏసీ నేతలు కూడా పర్యటించారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను అవమానించడం తగదంటూ మండిపడ్డారు. విశాఖలో భూదందాను సాగించేందుకే మూడు రాజధానులంటున్నారని దుయ్యబట్టారు. మహిళలు స్నానాలు చేసే చోట డ్రోన్లు తిప్పుతూ సంస్కారం మరచి మహిళల్ని మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలే చూసుకుంటున్నారని ధ్వజమెత్తారు.  ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని మహిళా జేఏసీ నేతలు స్పష్టంచేశారు. ఈ నెల 26న విజయవాడలో అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష చేపటనున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని