నాపై ఎంత కక్షో.. ఇదే ఉదాహరణ: చంద్రబాబు

గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు జరిపేందుకు సిట్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తన పైనా, తెదేపా పైనా ఈ ప్రభుత్వానికి...

Updated : 22 Feb 2020 22:21 IST

అమరావతి: తెదేపాతో పాటు తనపై వైకాపా ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చెప్పడానికి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ మరో ఉదాహరణ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 9 నెలల్లో మూడు సిట్‌లు.. ఐదారు కమిటీలు వేసి తెదేపానే కాదు.. ఏకంగా ఏపీనే టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. అడ్డగోలు చర్యలతో భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారని ట్విటర్‌లో దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి.. తవ్వండి అన్నారనీ.. తవ్వితే సన్మానాలు చేస్తాం.. అవార్డులు ఇస్తాం ప్లీజ్‌.. అంటూ అధికారులను బతిమిలాడుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎనిమిది నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. కొత్తగా సిట్‌ ఏర్పాటుతో కక్ష సాధింపు తప్ప ప్రజలకు కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తనపై 26 విచారణలు, సీబీసీఐడీ విచారణ చేయించినా ఏమీ నిరూపించలేకపోయారన్నారు. ఇప్పుడూ అదే జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ వేధింపులకు 344 జీవోనే పరాకాష్ఠగా నిలుస్తోందన్నారు. తెదేపా నాయకులపై కక్షసాధించడమే వైకాపా అజెండాగా పెట్టుకుందన్నారు. తెదేపా నేతలు ఏనాడూ తప్పుచేయలేదనీ.. వైకాపా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

అమరావతి, విశాఖలో భూ ఆరోపణలు వెలుగులోకి రావాలంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మరో ట్వీట్‌లో సవాల్‌ విసిరారు. పోలీస్‌ అధికారులతో వేసిన సిట్‌, స్టాండింగ్‌ కమిటీలతో వాస్తవాలు వెల్లడికావని ప్రజలు భావిస్తున్నారన్నారు. వివేకా హత్య కేసులో అధికారులను మార్చడంతో ఆ సిట్‌పై నమ్మకంలేక జగన్‌ సోదరే సీబీఐ విచారణ కోరారన్నారు. విశాఖ భూములపై వేసిన సిట్‌ను పక్కన పెట్టి మరో సిట్‌ వేసి వాస్తవాలను తారుమారుచేసే యత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను, అధికారులను బెదిరించడమే సిట్‌, స్టాండింగ్‌ కమిటీల లక్ష్యంగా మారిపోయిందని దుయ్యబట్టారు. నిర్దిష్టమైన అంశాలపై న్యాయ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని