వాళ్లంతా పెయిడ్‌ ఆర్టిస్టులే:వైకాపా ఎంపీ

అమరావతిలో తనపై తెదేపా అధినేత చంద్రబాబే దాడి చేయించారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని బాపట్ల వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. అమరావతి ఐకాస ముసుగులో...

Published : 25 Feb 2020 00:51 IST

విజయవాడ: అమరావతిలో తనపై తెదేపా అధినేత చంద్రబాబే దాడి చేయించారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని బాపట్ల వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. అమరావతి ఐకాస ముసుగులో తెదేపా మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. అమరావతి రథోత్సవంలో నడుచుకుంటూ వెళ్తుంటే తనను దూషించారనీ.. తన చెవుల వద్దకు వచ్చి కొందరు జై అమరావతి అని గట్టిగా నినాదాలు చేశారన్నారు. రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లే ముందే తమ కార్లపై కొందరు దాడి చేసినా సంయమనం పాటించామన్నారు. ఈ క్రమంలోనే తన కారు వెనుక ఉన్న కారు ఓ పెద్దాయనను ఢీకొందనీ.. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించామని సురేష్‌ వివరించారు. 

కొందరు మహిళలు తమ కార్ల వద్దకు వచ్చి కారంతో దాడి చేశారని,  దాడి చేసిన వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని సురేశ్‌ వ్యాఖ్యానించారు. దళిత ఎంపీ పట్ల చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. అక్రమాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే దాన్నుంచి దృష్టి మళ్లించేందుకే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళలను అడ్డు పెట్టుపెట్టుకుని దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. దాడులకు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ఆలపాటి రాజా దర్శకత్వం వహించారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ధర్నాలు పేరిట చేస్తోన్న ఆందోళనలను పోలీసులు కట్టడి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ఇటువంటి దారుణాలు ఇంకా జరుగుతాయని సురేష్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని